‘లింక్‌’ కోసం డబ్బులా?

Centeral Govt Will Fine If PAN Card Is Not Linked With Aadhaar - Sakshi

పాన్‌ కార్డును ఆధార్‌కు అనుసంధానం (లింక్‌) చేయనందుకు కేంద్ర ప్రభుత్వం జరిమానా విధించడం న్యాయం కాదు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచీ జూన్‌ నెలాఖరు వరకు ఈ లింక్‌ను చేయించుకోవడానికి అనుమతిస్తూ రూ. 1,000 జరిమానాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికితోడు.. లింక్‌ చేయడానికి వంద, రెండు వందల రూపాయలు ‘మీ సేవా’ కేంద్రాలలో తీసుకొంటున్నారు. పాన్‌ కార్డు అంటేనే సామాన్యులలో అత్యధికులకు తెలియదు. పాన్‌ కార్డు ఆధార్‌కు లింకు చేయక పోతే జూలై నుంచి తమ బ్యాంకు ఖాతా రద్దవుతుందని ఇంకా ఎక్కువ మందికి తెలియదు. 

ఇన్‌కమ్‌ టాక్స్‌  పరిధిలోకి రానివారి పాన్‌ కార్డ్‌ను ఆధార్‌తో లింక్‌ చేయాల్సిన అవసరం ఏమిటని చాలామంది మధ్యతరగతివారు ప్రశ్నిస్తున్నారు. అనేక మంది సామాన్యుల దగ్గర ఈ విషయాలను ప్రస్తావిస్తే తమకు ఈ విషయాలేవీ తెలియవన్నారు. ఈ సంగతి సామాన్యులకే కాదు. నిత్యం పేపర్లు చదివేవారికి, టీవీ వార్తలు చూసేవారికి కూడా తెలియక పోవడం గమనార్హం. అంటే ఆధార్‌కు పాన్‌ను లింక్‌ చేయాలనే విషయంపై తగిన ప్రచారం జరగలేదన్నమాట. విస్తృత ప్రచారం చేయకుండా జరిమానా వేయడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్థించుకోవడం గర్హనీయం. జీరో ఎకౌంట్‌ వల్ల, డ్వాక్రా గ్రూపుల వల్ల ప్రతి కుటుంబానికి కనీసం రెండు బ్యాంకు ఎకౌంట్లు ఉన్నాయి. బ్యాంకులలో జీరో ఎకౌంటు తెరిచి లావాదేవీలు జరిపితే పది వేల రూపాయల వరకు అప్పు ఇస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అది అమలుకు నోచుకోలేదు.

జీరో ఎకౌంట్‌లో కూడా కనీస నగదు ఉంటేనే లావాదేవీలు జరుగుతాయని బ్యాంకు అధికారులు అనడంతో ఖాతాదారులు కనీస నగదును ఎకౌంట్‌లో ఉంచవలసి వచ్చింది. దీంతో బ్యాంకులకు కోట్లాది రూపాయలు చేరినట్లు వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో కార్పొరేట్‌ కంపెనీలకు మాత్రం 10 లక్షల కోట్ల రూపాయల పైగా రుణమాఫీ చేశారు. కార్పొరేట్‌ పన్ను 30 శాతం నుంచీ 22 శాతానికి తగ్గించారు. కాకులను కొట్టి గద్దలకు వేయడమంటే ఇదే! సామాన్యుని పాన్‌ కార్డ్‌ను ఆధార్‌కు లింకు చేయాలనే నిబంధనను రద్దు చేయాలి. లేదా జరిమానా రద్దు చేయాలి.
– బి.బి. రామకృష్ణారావు; సామర్లకోట, కాకినాడ జిల్లా

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top