డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ మోసాలను అరికట్టడానికి CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సరికొత్త ఏఐ ఆధారిత వెరిఫికేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఏవరైనా సీబీఐ నోటీసులు, డిజిటల్ అరెస్టుల పేరుతో ప్రజలకు నోటీసులు అందితే అది సరైనదా కాదా అనే విషయం ఇక అభయ్ పోర్టల్‌లో సులువుగా తెలుసుకోవచ్చని పేర్కొంది.
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగానే నేరాలు సైతం అప్‌డేట్ అవుతున్నాయి. ఇది వరకులా ప్రత్యక్షపద్దతినో ప్రజలను లూటీ చేయడం కాకుండా కేవలం ఒక్క ఓటీపీతో ఖాతాలో ఉన్న డబ్బంతా సైబర్ నేరగాళ్లు లూటీ చేస్తున్నారు. అదే విధంగా సామాన్య ప్రజలను నేరాలు చేశావని భయపెడుతూ వారని అరెస్టు చేస్తామని జైళ్లో వేస్తామని బెదిరిస్తూ నకిలీ నోటీసులు అందజేసీ డబ్బులు కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఇకనుంచి ఏవరైనా సైబర్ నేరాలు పేరుతో ప్రజలని బెదిరిస్తే అది అసలైందా లేదా నకిలీదా అనే విషయం క్షణాల్లో తెలుసుకునేలా ఒక అభయ్ అనే సరికొత్త ఏఐ ఆధారిత పోర్టల్‌ని అందుబాటులోకి తెచ్చింది.
అభయ్ పోర్టల్‌ను వాడే విధానం?
మొదటగా సీబీఐ అధికారిక వెబ్‌సైట్ www.cbi.gov.in లోకి వెళ్లాలి.
హోమ్ పేజీలో కనిపించే ‘ABHAY’ లోగోపై క్లిక్ చేసి, మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత మీ మొబైల్‌కువచ్చే OTP ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
ఇప్పుడు మీకు వచ్చిన నోటీసు కాపీని పీడీఎఫ్ లేదా చిత్రం (Image) అక్కడ అప్‌లోడ్ చేయాలి.
మీ నోటీసును స్కాన్ చేసి, అది నిజమైనదా లేక నకిలీదా అనే విషయాన్ని ఈ AI చాట్‌బాట్ కేవలం నిమిషాల వ్యవధిలోనే తేల్చి చెబుతుంది.
ఈ సందర్భంగా ప్రజలకు సీబీఐ ఒక కీలక విషయాన్ని స్పష్టం చేసింది. భారతీయ చట్టంలో అసలు డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదని తెలిపింది. మిమ్మల్ని భయపెట్టి, కెమెరాల ముందు కూర్చోబెట్టి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామనే సైబర్ నేరగాళ్ల మాటలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దని తెలిపింది. నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్, అధికారుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


