20 ఏళ్లకు నిందితుడిని పట్టుకున్న సీబీఐ | CBI arrests accused after 20 years | Sakshi
Sakshi News home page

20 ఏళ్లకు నిందితుడిని పట్టుకున్న సీబీఐ

Mar 29 2026 4:40 AM | Updated on Mar 29 2026 4:40 AM

CBI arrests accused after 20 years

న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఓ విద్యార్థి హత్య కేసును ఎట్టకేలకు సీబీఐ ఛేదించింది. 2005లో కేరళలో జరిగిన హత్య కేసులో పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అండమాన్‌ వాసిని మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మారుపేరుతో చలామణీ అవుతున్నాడని గుర్తించి అరెస్ట్‌ చేసింది. కేరళ రాజధాని తిరువనంతపురానికి చెందిన శ్యామ్‌ మండల్‌ అనే విద్యార్థి 2005 అక్టోబర్‌లో కిడ్నాపయ్యాడు. దుండగులు అతడి తండ్రికి ఫోన్‌ చేసి, డబ్బులు డిమాండ్‌ చేశారు. ఇవ్వకుంటే చంపుతామని బెదిరించారు. అదే నెల 23వ తేదీన తిరువనంతపురంలోని వెల్లార్‌ వద్ద శ్యామ్‌ మృతదేహం కన్పించింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఈ కేసులో అండమాన్‌ నికోబార్‌కు చెందిన దుర్గా బహదూర్‌ భట్‌ ఛత్రి, మహ్మద్‌ అలీలను పోలీసులు నిందితులుగా గుర్తించారు. అలీని అరెస్ట్‌ చేసి, 2022లో జైలుకు పంపారు. ఛత్రి జాడ మాత్రం దొరకలేదు. 2008 డిసెంబర్‌లో ఈ కేసును కేరళ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. అప్పటి నుంచి ఇరవయ్యేళ్లుగా ఛత్రి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. ఎట్టకేలకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సూరజ్‌ భట్‌ అనే మారుపేరుతో ఛత్రి చలామణి అవుతున్నట్లు సీబీఐ వర్గాలు కనిపెట్టాయి. 

సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఛత్రి స్థానిక మహిళను వివాహం చేసుకున్నాడు. దీనిపై సీబీఐ స్థానిక పోలీసుల సాయం కోరింది. వారు గుర్తింపు కార్డులతోపాటు అతడి నేపథ్యం గురించి చుట్టుపక్కల వారిని ఆరాతీశారు. ఛత్రినే సూరజ్‌ భట్‌ అని పోలీసులు ధ్రువీకరించడంతో శుక్రవారం సీబీఐ బృందం అరెస్ట్‌ చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement