
రాయ్‌పూర్:కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం(డిసెంబర్15) ఛత్తీస్‌గఢ్ పర్యటన సందర్భంగా అపశృతి దొర్లింది. షా పర్యటనను పురస్కరించుకుని ఛత్తీస్‌గఢ్ కాంకేర్‌లో భద్రతా సిబ్బంది ముందస్తు తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీని భద్రతా సిబ్బంది గుర్తించారు. ఐఈడీని నిర్వీర్యం చేసే సమయంలో అది ఒక్కసారిగా పేలడంతో భద్రతా సిబ్బంది ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. తర్వాత భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో విస్త్రృత సోదాలు నిర్వహించారు. పేలుడు పదార్థాలతో తిరుగుతున్న తొమ్మిది మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. అమిత్ షా పర్యటన వేళ ఈ ఘటన చోటుచేసుకోవడంతో కాంకేర్‌లో హై అలర్ట్ ప్రకటించారు.
ఈ ప్రాంతంలో భద్రతా దళాలను భారీగా మోహరించినట్లు కాంకేర్ జిల్లా ఎస్పీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం రాయ్‌పుర్ చేరుకున్నారు. రాయ్‌పూర్,బస్తర్ జిల్లాల్లో జరిగే పలు కార్యక్రమాలకు ఆయన హాజరవుతారు.