
సాంకేతిక లోపంతో నెలకుపైగా కేరళలో నిలిపివేత
ఎట్టకేలకు బ్రిటన్‌కు...
త్రివేండ్రం: సాంకేతికలోపంతో కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో నెల రోజుల పాటు నిలిచిపోయిన బ్రిటన్‌కు చెందిన అత్యంత అధునాతన ఎఫ్–35బీ యుద్ధవిమానం ఎట్టకేలకు స్వదేశానికి పయనమైంది. సరిపడా ఇంధనం లేకపోవడం, అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ విమానం జూన్ 14వ తేదీన కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండవడం తెలిసిందే. ఆ తర్వాత ఎన్నిసార్లు రిపేర్లుచేసినా మళ్లీ టేకాఫ్ తీసుకోలేక అక్కడే రన్‌వే పైనే చతికిలపడిన విషయం విదితమే.
కీలక హైడ్రాలిక్ వ్యవస్థ వైఫల్యంతో యుద్ధవిమానం ఎగరలేకపోయింది. దాన్ని సరిచేయడానికి బ్రిటన్ రాయల్ నేవీ టెక్నీషియన్ల బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విమానం సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) రక్షణలో నాలుగో నంబర్ రన్‌వేపై ఉండిపోయింది. హైడ్రాలిక్ వ్యవస్థ వైఫల్యం కారణంగా చివరకు ఈ యుద్ధవిమానం రెక్కలను జాగ్రత్తగా విడదీసీ అత్యంత భారీ సరకు రవాణా సైనిక విమానంంలో బ్రిటన్‌కు తరలించనున్నట్లు మొదట్లో వార్తలొచ్చాయి. అయితే చివరి ప్రయత్నంగాబ్రిటన్ నుంచి ప్రత్యేకంగా 40 మంది బ్రిటిష్ ఇంజనీర్లు, నిపుణుల బృందం తిరువనంతపురం విచ్చేసింది.
రిపేర్ల కోసం ఎట్టకేలకు యుద్ధ విమానాన్ని రన్‌వే మీద నుంచి హ్యాంగర్‌కు తరలించారు. జూలై ఆరో తేదీన ఎయిర్‌బస్ ఎ400ఎమ్ అట్లాస్ విమానంలో కొత్త విడిభాగాలు, అధునాతన పరికరాలతో రాయల్ ఎయిర్ ఫోర్స్ బృందం రాకతో పరిస్థితులు మారిపోయాయి. ఫైటర్ జెట్‌కు చకచకా మరమ్మతు చేశారు. లాక్‌హీడ్ మారి్టన్ రక్షణరంగ తయారీసంస్థ అభివృద్ధిచేసిన ఈ ఎఫ్–35బీ.. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన, ఖరీదైన యుద్ధ విమానాల్లో ఒకటి. దీని ధర దాదాపు రూ.950 కోట్లు. అత్యవసర పరిస్థితుల్లో నిట్టనిలువుగా ల్యాండింగ్ కావడం ఈ విమానం ప్రత్యేకత. ఇది నాటో వైమానిక శక్తికి మూలస్తంభం లాంటిదని చెప్పొచ్చు.