పశ్చిమాసియా శాంతి..  అందని ద్రాక్ష కానివ్వం  | BRICS Foreign Ministers Discuss West Asia Crisis | Sakshi
Sakshi News home page

పశ్చిమాసియా శాంతి..  అందని ద్రాక్ష కానివ్వం 

May 15 2026 1:03 AM | Updated on May 15 2026 1:03 AM

BRICS Foreign Ministers Discuss West Asia Crisis

బ్రిక్స్‌ విదేశాంగ మంత్రుల సదస్సులో జైశంకర్‌ స్పషీ్టకరణ

న్యూఢిల్లీ: దేశరాజధానిలో గురువారం మొదలైన బ్రిక్స్‌ విదేశాంగ మంత్రుల శిఖరాగ్ర సదస్సులో పశ్చిమాసియా సంక్షోభంపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఇకనైనా హార్మూజ్‌ జలసంధి తెరచుకునేలా, సముద్రమార్గంలో సరకుల రవాణా సవ్యంగా జరిగి ముడిచమురు, నిత్యావసరాల ధరలు దిగొచ్చేలా ప్రపంచదేశాలు సమష్టి నిర్ణయాలు తీసుకుని పశ్చిమాసియా యుద్ధమేఘాలను చెల్లాచెదురుచేయాలని భారత్‌ ఆశాభావం వ్యక్తంచేసింది. 

అగ్రరాజ్యాల అసంబద్ధ ఆంక్షల కత్తిని తొలగించేలా ఉమ్మడి పోరాటం చేయాలని బ్రిక్స్‌ దేశాలకు భారత్‌ పిలుపిచ్చింది. రెండ్రోజులపాటు జరిగే బ్రిక్స్‌ విదేశాంగ మంత్రుల సదస్సులో తొలిరోజు భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ప్రసంగించారు. ఇరాన్‌పై దాడికి తెగబడిన అమెరికానుద్దేశించి జైశంకర్‌ పరోక్ష వ్యాఖ్యలుచేశారు. దేశాల సార్వభౌమత్వాన్ని, సమగ్రతను తోటి దేశాలు గౌరవించాలని హితవు పలికారు. ‘‘శాంతి అనేది కలగా మిగిలిపోనివ్వం. 

అంతర్జాతీయ చట్టాల ఉనికి శాంతే కీలకం. ప్రజలను కాపాడాన్నా, మౌలిక వసతుల పరిరక్షించాలన్నా శాంతి వెల్లివిరియాలి. సంఘర్షణలకు సంప్రతింపులు, దౌత్యమే అత్యుత్తమ మార్గం. ‘‘పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంతో సముద్రమార్గంలో సరకు రవాణా కష్టమైంది. ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. హార్మూజ్‌ తెరచుకోవాలి. ఎర్రసముద్రం గుండా రవాణా కొనసాగాలి. ఇక గాజాలో మానవతా సాయం ఊపందుకోవాలి. 

శాశ్వత కాల్పుల విరమణ, మానవతా సాయం పెంపు, విశ్వసనీయ మధ్యవర్తిత్వం ద్వారా శాంతిని సాధించం అనేవి ఎంతో కీలకం. పాలస్తీనియన్ల భవిష్యత్తు దృష్ట్యా రెండు దేశాల విధానానికి భారత్‌ ఓటేస్తోంది’’అని జైశంకర్‌ అన్నారు. గురువారం బ్రిక్స్‌ సెషన్స్‌లో ఒక దాంట్లో చర్చవేళ యూఏఈ, ఇరాన్‌ విదేశాంగ మంత్రుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. 

అక్కడే ఉన్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ జోక్యంచేసుకోవడంతో ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ, యూఏఈ విదేశాంగ మంత్రి ఖలీఫా షాహీన్‌ అల్‌ మరార్‌లు శాంతించారని తెలుస్తోంది. ఈ సెషన్‌లో బ్రెజిల్‌ విదేశాంగ మంత్రి మారో వియేరా, ఇండోనేసియా విదేశాంగ మంత్రి సుగియానో, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రోనాల్డ్‌ లామోలా తదితరులు పాల్గొన్నారు. తమదేశంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ దాడులు చేయడంపై యూఏఈ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.  

విస్తరణవాదానికి మేం బలయ్యాం 
ఈ సందర్భంగా ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ మాట్లాడారు. ‘‘యుద్దకాంక్షతో రగిలిపోతున్న దేశాల అక్రమ రాజ్యవిస్తరణవాదానికి మేం బలైపోతున్నాం. నేటి సమాజంలో ఇలాంటి ధోరణులకు చోటివ్వకూడదు. హేయమైన దాడులు జరుగుతున్నా ఇరాన్‌ ప్రజలు మొక్కవోని ఆత్మవిశ్వాసంతో శాంతి కోసం పరితపిస్తున్నారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు పోరాడుతున్నారు. అంతర్జాతీయ చట్టాలను కాలరాస్తూ మాపై యుద్ధానికి కాలు దువ్విన అమెరికా, ఇజ్రాయెల్‌ను బ్రిక్స్‌ సభ్యదేశాలు తప్పుబట్టాల్సిందే’’అని అరాఘ్చీ డిమాండ్‌చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement