ఎల్‌ఈడీ టీవీ పేలి బాలుడు మృతి.. పేలుడుకు కారణాలేంటి?

Boy Died After An LED TV Exploded In His House In Uttar Pradesh - Sakshi

లక్నో: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది. దాదాపుగా అన్ని ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ టీవీలే ఉపయోగిస్తున్నారు. అయితే, వాటిని వినియోగించటంలో చిన్న చిన్న తప్పులు చేయటం వల్ల ఒక్కోసారి ప్రాణాలపైకి వస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లోని ఓ ఇంటిలో ఎల్‌ఈడీ టీవీ పేలిపోయి 16 ఏళ్ల అమరేందర్‌ అనే బాలుడు మృతి చెందిన విషాద ఘటన వెలుగు చూసింది. తన స్నేహితులతో కలిసి బాధితుడు సినిమా చూస్తుండగా ఒక్కసారిగా టీవీ పేలిపోయింది. పేలుడు దాటికి భవనం గోడలు సైతం బీటలువారాయంటే ఏ స్థాయిలో పేలుడు సంభవించిందో ఊహించవచ్చు.  ఈ ఘటనలో బాధితుడి తల్లి, సోదరుడు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఈ విధంగా టీవీలు పేలిన సంఘటనలు చాలా అరుదు. దీనికి గల కారణాలపై నిపుణులు సైతం అంచనాకు రాలేకపోతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ‘ఇద్దరు మహిళలు, ఇద్దరు బాలురు గాయపడ్డారు. దురదృష్టవశాత్తు ఒక బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గోడకు బిగించిన ఎల్‌ఈడీ టీవీ పేలటం వల్లే బాలుడు మరణించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.’ అని గాజియాబాద్‌ పోలీసు అధికారి జ్ఞానేంద్ర సింగ్‌ తెలిపారు. 

టీవీ పేలిపోవటంతో గోడలకు ఏర్పడిన పగుళ్లు

ఎల్‌ఈడీ టీవీ బ్లాస్ట్‌కు కారణాలు.. 
పాత, నకిలీ కెపాసిటర్: ఎల్‌ఈడీ టీవీలు పేలడానికి ప్రధానంగా పాత లేదా నకిలీ కెపాసిటర్‌ కారణమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సరైన స్థాయిలో కెపాసిటర్‌ విద్యుత్తును సరఫరా చేస్తుంది. అయితే, కెపాసిటర్ వల్ల ఆ స్థాయిలో పేలుడు సంభవించకపోవచ్చు. 

► ఓల్టేజ్‌ హెచ్చుతగ్గులు: విద్యుత్తు ఓల్టెజ్‌ హెచ్చుతగ్గులకు లోనవటమూ ఓ కారణంగా చెప్పవచ్చు. ఒక్కసారిగా హైఓల్టేజ్‌ సరఫరా అవుతే టీవీలు పేలిపోతాయి.

► ఓవర్‌ హీట్‌: టీవీ ఎక్కువగా వేడెక్కడం సైతం పేలిపోవటానికి దారితీస్తుంది. ఒక్కటికంటే ఎక్కువ డివైజ్‌లతో కనెక్ట్‌ చేస్తే ఓవర్‌ హీట్‌ అవుతుంది. నకిలీ కెపాసిటర్‌ లాగే ఓవర్‌ హీట్‌ కూడా పేలుడుకు కారణమవుతుంది. 

నిర్వహణ లేకపోవటం: టీవీని గోడకు బిగించామంటే దానిని పట్టించుకోరు. నిర్వహణ సరిగా లేకపోవటం, రిపేర్లు సరైన రీతిలో చేయించకపోవటం వంటివి సైతం పేలడానికి దారితీస్తాయి. రిపేర్‌ వచ్చినప్పుడు సరైన సర్వీస్‌ సెంటర్లకు తీసుకెళ‍్లాలి. రిపేర్‌ కోసం నాణ్యతకు ప్రాధాన్యత నివ్వాలి.

ఇదీ చదవండి: రష్యా, ఉక్రెయిన్‌ హక్కుల గ్రూప్‌లకు నోబెల్‌ శాంతి బహుమతి

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top