బీజేపీకి అత్యధికంగా రూ. 276 కోట్లు | Sakshi
Sakshi News home page

బీజేపీకి అత్యధికంగా రూ. 276 కోట్లు

Published Thu, Jun 24 2021 5:35 AM

BJP received Rs 276 crore from electoral trusts in 2019-20 - Sakshi

న్యూఢిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా వివిధ రాజకీయ పార్టీలకు 2019–20లో వచ్చిన విరాళాల వివరాలను అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫారమ్స్‌ (ఏడీఆర్‌) వెల్లడించింది. మొత్తం ఏడు ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ల నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి అత్యధికంగా రూ. 276.45 కోట్లు విరాళంగా వచ్చాయి. ఇది మొత్తం విరాళాల్లో 76.17%. ఆ తరువాతి స్థానంలో ఉన్న కాంగ్రెస్‌కు 15.98% (రూ. 58 కోట్లు) విరాళాలు మాత్రమే వచ్చాయని బుధవారం ఏడీఆర్‌ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. అత్యధికంగా విరాళాల ఇచ్చిన సంస్థల్లో జేఎస్‌డబ్ల్యూ, అపోలో టైర్స్, ఇండియాబుల్స్, ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్, డీఎల్‌ఎఫ్‌ గ్రూప్‌ తొలి ఐదుస్థానాల్లో ఉన్నాయి.

జేఎస్‌డబ్ల్యూ అత్యధికంగా రూ. 39.10 కోట్లను ఇవ్వగా, అపోలో టైర్స్‌ రూ. 30 కోట్లను, ఇండియాబుల్స్‌ రూ. 25 కోట్లను విరాళంగా ఇచ్చాయి. 18 మంది వ్యక్తులు కూడా వ్యక్తిగత విరాళాలను ఈ ట్రస్ట్‌లకు అందించారు. వారిలో 10 మంది ప్రుడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌కు మొత్తం రూ. 2.87 కోట్లను అందించారు. స్మాల్‌ డొనేషన్స్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌కు ఐదుగురు వ్యక్తులు రూ. 5.5 లక్షలు ఇచ్చారు. మరో నలుగురు స్వదేశీ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌కు రూ. 1 లక్ష ఇచ్చారు. ఇతర పార్టీల్లో ఆప్, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, యువ జనజాగృతి పార్టీ, జననాయక పార్టీ, జేడీయూ, జేఎంఎం, ఎల్జేపీ, శిరోమణి అకాలీదళ్, జేకేఎన్‌సీ, ఐఎన్‌ఎల్‌డీ, ఆర్‌ఎల్‌డీ పార్టీలు కలిసి రూ. 25.46 కోట్లు అందుకున్నాయి. విరాళాలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రతీ సంవత్సరం నివేదిక రూపంలో తమకు అందించాలని ఎన్నికల సంఘం ఎలక్టోరల్‌ ట్రస్ట్‌లను ఆదేశించిన విషయం తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement