అస్సాంలో బీజేపీ హావా కొనసాగుతుంది. రికార్డు స్థాయి విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతుంది. మైనార్టీల శాతం అధికంగా ఉన్న రాష్ట్రంలో బంపర్ మోజారిటీ దిశగా సాగుతుంది. అయితే బీజేపీకి ఇంత భారీ విజయం దక్కడం వెనుక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ రాజకీయ ఎత్తుగడలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.
హిమంత మార్క్ పాలన
అసోంలో ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా మహిళలను బాగా ఆకర్షించాయి. 'అరుణోదోయ్' ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు ప్రభుత్వానికి పెద్దఎత్తున మైలేజ్ ఇచ్చాయి. ఈ పథకం మతాలకు అతీతంగా పేద మహిళల మద్దతును కూడగట్టుకునేలా చేసిందిదానితో పాటు స్థానిక అస్సామీలకు ప్రత్యేక గుర్తింపునిచ్చేలా "భూమిపుత్రులకు రక్షణ" అనే నినాదంతో ఆయన ప్రచారం సాగించారు. అక్రమ చొరబాటుదారుల అంశాన్ని బలంగా వినిపిస్తూ, స్థానిక అస్సామీ సంస్కృతిని కాపాడతామనే భరోసానివ్వడం స్థానికంగా ఎంతో కలిసివచ్చింది. అయితే సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా రోడ్ షోలు, బహిరంగ సభల్లో ప్రజలతో నేరుగా మమేకమయ్యే తీరు ఆ రాష్ట్రంలో యువతను బాగా ఆకర్షించింది.
మైనార్టీల ఓట్లు అధికంగా ఉన్నప్పటికీ విజయం ఎలా సాధ్యమైంది?
హిమంత బిశ్వశర్మ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ 2023లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అస్సాం రాజకీయాల్లో కీలక మార్పు తెచ్చింది. దీనివల్ల మైనార్టీ ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్న స్థానాల సంఖ్య తగ్గింది. ఫలితంగా, స్థానిక అస్సామీ జనాభా ప్రభావం ఉన్న స్థానాల్లో బీజేపీ బలం పెరిగింది. గతంలో కాంగ్రెస్, AIUDF (బద్రుద్దీన్ అజ్మల్ పార్టీ) కలిసి పోటీ చేసేవి. కానీ ఈసారి విడివిడిగా లేదా బలహీనమైన కూటములతో పోటీ చేయడం వల్ల మైనార్టీ ఓట్లు చీలిపోయి బీజేపీకి మేలు జరిగింది.దానితో పాటు తిరుగుబాటు దారుల సమస్య అధికంగా ఉండడంతో ఆ సమస్య ప్రధానంగా ఎన్నికల ప్రచారం సాగింది.రాష్ట్రంలోని వివిధ హిందూ వర్గాలను (అస్సామీ, బెంగాలీ, గిరిజనులు) బీజేపీ ఒకే తాటిపైకి తీసుకురాగలిగింది.
హిమంత బిశ్వశర్మ నేపథ్యం
2015 వరకూ జాతీయ కాంగ్రెస్‌లో కీలక నేతగా కొనసాగిన హిమంత బిశ్వశర్మ హస్తంతో విభేదాల కారణంగా బీజేపీలో చేరారు. చేరిన ఏడాదికే ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రాగా తన ఎత్తులతో 15 ఏళ్లుగా బీజేపీ కూటమిని అధికారంలోకి వచ్చేలా చేశారు. దీంతో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కోటకు బీటలు వారింది. అయితే ఆసమయంలో సర్బానంద సోనోవాలా ముఖ్యమంత్రి కాగా అతని క్యాబినెట్‌లో హిమంత మంత్రిగా పనిచేశారు.
అనంతరం 2021లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ బీజేపీ వరుసగా రెండో సారి అధికారం చేజిక్కించుకుంది. అయితే ఈ సారి కమలనాథులు హిమంతకే ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న హిమంత అభివృద్ధే లక్షంగా సంక్షేమ పథకాలతో తనదైన శైలిలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందు నడిపారు. హిమంత నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి సైతం బీజేపీ భారీ మెజారీటీతో అధికారం దిశగా దూసుకుపోతుంది.


