భోజ్‌శాలకు భక్తజనం.. మార్మోగిన హనుమాన్ చాలీసా! | Court Verdict On Bhojshala Complex Sparks Religious Activity As Devotees Gather For Prayers At Kamal Maula Mosque Site | Sakshi
Sakshi News home page

భోజ్‌శాలకు భక్తజనం.. మార్మోగిన హనుమాన్ చాలీసా!

May 16 2026 10:39 AM | Updated on May 16 2026 10:53 AM

Bhojshala Declared Temple Devotees Rejoice After Historic HC Verdict

ధార్‌: మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ధార్‌లోని భోజ్‌శాల ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దశాబ్దాలుగా వివాదంలో ఉన్న భోజ్‌శాల-కమల్ మౌలా మసీదు సముదాయం వాస్తవానికి సరస్వతీ దేవి (వాగ్దేవి) ఆలయమేనని న్యాయస్థానం స్పష్టం చేయడంతో హిందూ భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తీర్పు వెలువడిన మరుసటి రోజే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మార్మోగిన మంత్రోచ్ఛారణలు
శనివారం ఉదయం భోజ్‌శాల ఉత్సవ సమితి ప్రతినిధులతో కలిసి వందలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు.  హనుమాన్ చాలీసా పఠిస్తూ, దేవికి హారతి సమర్పించారు. తమ న్యాయపోరాటం ఫలించడంతో భక్తులు ఆనందభాష్పాలతో నృత్యాలు చేశారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతిరోజూ పూజలు చేసుకునే అవకాశం దక్కిందని వారు హర్షం వ్యక్తం చేశారు. లండన్ మ్యూజియంలో ఉన్న వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి తీసుకురావడమే తమ తదుపరి లక్ష్యమని ఉత్సవ సమితి సభ్యులు ప్రకటించారు.

రద్దయిన 2003 ఏఎస్‌ఐ (ASI) ఉత్తర్వులు
ఈ చారిత్రక తీర్పులో హైకోర్టు కీలక విషయాలను స్పష్టం చేసింది. వివాదాస్పద స్థలంలో పూజా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయని, చారిత్రక ఆధారాల ప్రకారం అది పరమార వంశానికి చెందిన రాజభోజుడు నిర్మించిన సంస్కృత విద్యాకేంద్రం (భోజ్‌శాల) అని ధృవీకరించింది. దీనితో పాటు ముస్లింలు శుక్రవారం నమాజ్ చేసుకునేందుకు అనుమతిస్తూ భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) 2003లో జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. ఆ ప్రాంగణంపై పూర్తి ఆరాధనా హక్కులు హిందువులకే ఉన్నాయని స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టుకు వెళ్తామన్న ముస్లిం పక్షం
హైకోర్టు తీర్పు నేపథ్యంలో, ముస్లిం కక్షిదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను ముందుగానే ఊహించిన హిందూ పక్షం న్యాయవాది విష్ణు శంకర్ జైన్, తాము కూడా సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసి తమ వాదనలను బలంగా వినిపిస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం తమకు లభించిన ప్రాథమిక ఆరాధనా హక్కులను వినియోగించుకుంటూ,  ప్రతిరోజూ భోజ్‌శాలలో పూజలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement