మార్గరెట్‌ బూర్కి–వైట్‌: తను లేరు, తనిచ్చిన లైఫ్‌ ఉంది

Azadi Ka Amrit Mahotsav: Mahatma Gandhi Margaret Bourke White - Sakshi

మహోజ్వల భారతి: వ్యక్తులు ::: ఘటనలు ::: సందర్భాలు ::: స్థలాలు :: సమయాలు  (ప్రీ–ఫ్రీడమ్, పోస్ట్‌ ఫ్రీడమ్‌)

దేశ విభజన రక్తకన్నీటి ధారలను తన కెమెరాతో బంధించిన వారిలో ముఖ్యులు మార్గరెట్‌ బూర్కి–వైట్‌. ‘గ్రేట్‌ కలకత్తా కిల్లింగ్స్‌’ పేరుతో ప్రసిద్ధమైన హత్యాకాండ మిగిల్చిన విషాదాన్ని మార్గరెట్‌ భావి తరాలు మరచిపోలేని విధంగా చిత్రీకరించారు. మార్గరెట్‌ (1904–1971) అమెరికా పౌరసత్వం తీసుకున్న పోలెండ్‌ జాతీయురాలు. తండ్రి జోసెఫ్‌ వైట్‌ యూదు జాతీయుడు. తల్లి మిన్నీ బూర్కి ఐరిష్‌ జాతీయురాలు. తల్లి మీద ప్రేమతో బూర్కి (ఆమె ఇంటిపేరు) పేరును కూడా మార్గరెట్‌ తన పేరులో చేర్చుకున్నారు. మార్గరెట్‌ చిన్నతనం న్యూజెర్సీలో గడిచింది.

కెమెరాలంటే ఆసక్తి చూపించే తండ్రి నుంచి ప్రోత్సాహం రావడంతో చిన్ననాడే ఆమె ఫొటోలు తీయడం ఆరంభించారు. ఆమె ప్రఖ్యాత ‘లైఫ్‌’లో పనిచేసిన తొలి మహిళా ఫొటోగ్రాఫర్‌. అలాగే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రణభూమి దగ్గర ఉండి ఫొటోలు తీసే అవకాశం వచ్చిన మొదటి మహిళ మార్గరెట్‌. అప్పుడే క్రెమ్లిన్‌ (రష్యా) మీద నాజీ సేనల దాడుల (1941) దృశ్యాలను తన కెమెరాలో బంధించే అవకాశం ఆమెకు దక్కింది. ఇలాంటి సంక్షుభిత పరిణామాలను చిత్రించేందుకు అనుమతి పొందిన ఏకైక విదేశీయురాలు మార్గరెట్‌. తన ఫొటో తీయడానికి స్టాలిన్‌ కూడా ఆమెను అనుమతించాడు.

సోవియెట్‌ పరిశ్రమలను ఫొటోలు తీయడానికి అనుమతి పొందిన తొలి పాశ్చాత్య మహిళ కూడా ఆమే. హిట్లర్‌ పతనం తరువాత జర్మనీ దుస్థితిని కూడా ఆమె తన ఫ్రేములలో బంధించారు. మహాత్మా గాంధీ ఫొటోలు తీయడానికే మార్గరెట్‌ మార్చి, 1946లో భారతదేశానికి వచ్చారు. చరఖా ముందు కూర్చుని ఉన్న గాంధీజీ ఫొటో మార్గరెట్‌ తీసిందే. ఇంకా చాలా పోజులలో గాంధీజీ ఫొటోలు ఉన్నాయి. ఆమె భారతదేశం కోసం తీసిన ఫొటోలు 66. అందులో గాంధీ, జిన్నా, అంబేడ్కర్‌ వంటి చరిత్రపురుషుల పోర్ట్రయిట్‌లు, విభజన విషాదాల ఫొటోలు ప్రధానంగా ఉన్నాయి.

అసలు భారత విభజన విషాదాన్ని కెమెరాలో బంధించడానికే ఆమె ఇక్కడికి వచ్చారని అనిపిస్తుంది. మార్గరెట్‌ పార్కిన్సన్‌ పెయిన్‌ వ్యాధితో 1971లో తుదిశ్వాస విడిచారు. భారత స్వాతంత్య్ర సమరం అహింసాయుతంగా మొదలై, దారుణమైన హింసతో ముగిసింది. ఇదొక వైచిత్రి. గాంధీజీ వంటి అహింసామూర్తిని ఫొటోలు తీయడానికి వచ్చిన మార్గరెట్‌ హింసాత్మక భారతాన్ని చూశారు. నేడు (జూన్‌ 14) మార్గరెట్‌ జయంతి. 

గాంధీజీ నూలు వడికే మగ్గం దగ్గర ఉన్న చరిత్రాత్మకమైన ఫొటోను తీసింది మార్గరెటే! (పైఫొటో:) మార్గరెట్‌ బూర్కి వైట్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top