స్వతంత్ర భారతి: అఫ్‌స్పా చట్టం

Azadi Ka Amrit Mahotsav: AFSPA Act Details - Sakshi

తీవ్రవాదాన్ని అణచివేసి, శాంతిభద్రతలను కాపాడడమే ధ్యేయంగా ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, అస్సాం, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, మిజోరామ్, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని 1958 సెప్టెంబర్‌ 11 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం సైనిక దళాలకు కొన్ని అధికారాలు దక్కాయి. ముందస్తుగా వారంట్‌ ఇవ్వకుండానే ఎవరినైనా అరెస్టు చేయొచ్చు. సోదాలు నిర్వహించవచ్చు. ఎవరినైనా కాల్చి చంపినా అరెస్టు, విచారణ నుంచి ప్రత్యేక రక్షణ ఉంటుంది. అయితే ఆనాటి నుంచీ ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి.

ఏఎఫ్‌ఎస్‌పీఏకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త ఇరోం చాను షర్మిళ 16 ఏళ్లపాటు నిరాహార దీక్ష కొనసాగించారు. 2015లో త్రిపురలో, 2018లో మేఘాలయాలో ఈ  చట్టాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 న నాగాలాండ్, అస్సాం, మణిపూర్‌ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈ వివాదాస్పద సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ)–1958 ను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సంచలన ప్రకటన చేశారు.

అస్సాంలో 23 జిల్లాలు, మణిపూర్‌లో 6 జిల్లాలు (15 పోలీసు స్టేషన్ల పరిధిలో), నాగాలాండ్‌లో 7 జిల్లాలకు (15 పోలీసు స్టేషన్ల పరిధిలో) ఈ చట్టం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఇదొక కీలకమైన అడుగు అని ఆయన అభివర్ణిం చారు. 2021 డిసెంబర్‌లో నాగాలాండ్‌లో సైనికుల దాడిలో 14 మంది సాధారణ ప్రజలు మృతి చెందారు. దాంతో అక్కడి ప్రజల వినతి మేరకు ఏఎఫ్‌ఎస్‌పీఏ (అఫ్‌స్పా) ను ఎత్తివేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top