ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో ఆప్‌కు ఎదురుదెబ్బ.. స్పందించిన కేజ్రీవాల్‌

Arvind Kejriwal Reacts To Exit Polls On Poor AAP Show In Gujarat - Sakshi

గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఓటర్లు గట్టి షాక్‌ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా పోరాడిన కేజ్రీవాల్‌ పార్టీ బోల్తా కొట్టింది. రెండు రాష్ట్రాల్లోనూ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. సోమవారం సాయంత్రం విడుదలైన పలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఆప్‌కు తీవ్ర నిరాశను మిగిల్చాయి.

గుజరాత్‌ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరిగిందని అంతా భావించారు. అధికార బీజేపీ పార్టీకి గట్టి పోటి ఇస్తుందని అనుకున్నారు. అందుకు తగ్గట్లే మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో బీజేపీని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ పార్టీ భారీ ప్రచారం నిర్వహించింది. కానీ అలాంటిదేమీ లేదని తేలిపోయింది. అంచనాలను తలకిందులు చేస్తూ ఆప్‌ను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని తెలుస్తోంది. కేవలం అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌ మధ్యే పోటీ జరిగినట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్తున్నాయి. అంతేగాక హిమాచల్‌లోనూ ఆప్‌ కనీసం ఖాతా తెరవడం కష్టమని దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చేశాయి.  

182 సీట్లు ఉన్న గుజరాత్‌లో ఆప్‌ కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకోనున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించాయి. కనీసం రెండో స్థానంలో కూడా నిలువలేకపోయింది. గుజరాత్‌లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ నిలిచింది. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ను ఆప్‌ నేతలు ఖండిస్తున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పని రుజువవుతుందని.. వాస్తవానికి దాదాపు 100 సీట్లకు దగ్గరగా గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే హిమాచల్‌లో కాంగ్రెస్‌కు మద్దతిస్తారా అనే ప్రశ్నకు సమాధానం దాటవేశారు కేజ్రీవాల్‌.

తాజాగా గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలపై ఢిల్లీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. గుజరాత్‌ ఎన్నికల రిజల్ట్స్‌ తమకు సానుకూలంగా  రానున్నట్లు పేర్కొన్నారు. గుజరాత్‌లో ఓ కొత్త పార్టీ 15 నుంచి 20 శాతం ఓట్లు రావడం, అది కూడా బీజేపీ కంచుకోటగా ఉన్న గుజరాత్‌లో చాలా పెద్ద విషయమని అన్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు వేచి ఉంటామని తెలిపారు.

మరోవైపు ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో మాత్రం ఆప్‌ విజయ కేతనం ఎగురవేయనున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌లో తేలింది.  250 సీట్లున్న ఢిల్లీ కార్పొరేషన్‌లో ఆప్ 150 సీట్లకు పైగానే గెల్చుకునే అవకాశం ఉన్నట్లు దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దీంతో 15 ఏళ్ల తర్వాత ఎంసీడీ పీఠాన్ని బీజేపీ ఆప్‌కు అప్పగించబోతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 100 లోపు సీట్లకే పరిమితమవుతున్నట్లు తేలిపోయింది. 

చదవండి: ‘పని’కొచ్చే విద్య కావాలి! ఒక సబ్జెక్ట్‌లో బీటెక్‌.. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌లో చేరిపోవడం!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top