విదేశాల్లో ఆంథ్రోపిక్ ఏఐ మోడళ్లపై అమెరికా నిషేధం
నిషేధం వల్ల శక్తిమంతమైన టూల్స్‌ను కోల్పోనున్న విదేశీ సంస్థలు
అమెరికా కంపెనీలకు అడ్వాంటేజ్
భారత్‌తో సహా ఇతరదేశాల సాఫ్ట్‌వేర్ సంస్థలు వెనకబడే అవకాశం
యాక్సెస్ లేకపోతే స్టార్టప్‌ల ఇన్నోవేషన్ నెమ్మదించే అవకాశం
దీన్నో సాఫ్ట్‌వేర్‌లా కాకుండా మిలిటరీ టెక్నాలజీలా చూస్తున్న అమెరికా
చిప్‌లు, సెమీ కండక్టర్లు, సూపర్ కంప్యూటర్లను దాటిన నియంత్రణ
ఏఐని నియంత్రిస్తున్న దేశాలు రూటు మారుస్తున్నాయి. ఇప్పటిదాకా చిప్‌లను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవటంపై దృష్టి పెట్టినా... ఇపుడు ఏఐ మోడల్స్‌నూ నియంత్రించే చర్యలు మొదలెట్టాయి. అమెరికా ప్రభుత్వం ఆదేశించిన మీదట... ఆంథ్రోపిక్ సంస్థ తన క్లాడ్‌లో మైథోస్–5, ఫేబుల్–5 మోడళ్లను ఇతర దేశాల్లో ఎవరూ వాడకుండా నిషేధించటం... ఒక ఆరంభం మాత్రమే. అత్యాధునిక ఏఐ మోడళ్లను స్వదేశంలో తప్ప ఇంకెక్కడా వాడకుండా చేయటం ద్వారా ఏఐపై గుత్తాధిపత్యం సాధించాలనేది అమెరికా వ్యూహం కావచ్చనేది నిపుణుల మాట.
ఇలాంటి చర్యలతో ఏఐ వాడకంలో అంతరాలు తారస్థాయికి చేరుతాయి కాబట్టి భారతదేశం ఏఐ మిషన్‌ను ఆరంభించి, రూ.50వేల కోట్లు కేటాయించాలని టెక్నోక్రాట్ మోహన్‌దాస్ పాయ్ ప్రధాని మోదీని అభ్యరి్థంచటం గమనించాల్సిన విషయం. అమెరికా నిషేధం నేపథ్యంలో అసలు ఈ మైథోస్–5, ఫేబుల్–5 ఏం చేస్తాయి? నిషేధంతో నష్టాలేంటి? అమెరికా చెబుతున్న భద్రత కారణాలు నిజమేనా?ఇవన్నీ విశ్లేషించేదే ఈ ‘సాక్షి’ప్రత్యేక కథనం...
అమెరికాలో మినహా విదేశాల్లో యాక్సెస్ లేకుండా నిషేధించిన మైథోస్, ఫేబుల్ మోడళ్లు అత్యా«ధునికమే కాదు. శక్తిమంతమైనవి కూడా. ప్రత్యేకించి మైథోస్–5 ఉపయోగించి సైబర్ సెక్యూరిటీని ఉల్లంఘించవచ్చు. ఎదురుదాడులు చేయొచ్చు. అందుకే గ్లాస్‌వింగ్ లాంటి కార్యక్రమాల ద్వారా దీని వాడకాన్ని కొన్ని సంస్థలకే అందించింది ఆంథ్రోపిక్. మైథోస్‌లోని ఫీచర్లన్నీ ఉండి... కొన్ని నియంత్రణలతో అందరికీ అందించిన మోడల్ ఫేబుల్. ఒక్కమాటలో చెప్పాలంటే మైతోస్–5 రేసింగ్ కార్ అయితే... సాధారణ రోడ్లపై తిరగటానికి ఆవిష్కరించిన దాని లీగల్ వెర్షనే ఫేబుల్–5.
మైథోస్–5 ఎందుకు స్పెషల్ అంటే?
అటానమస్ కోడింగ్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, సెక్యూరిటీ అనాలిసిస్, దీర్ఘ కాలిక రీజనింగ్, శాస్త్రీయ పరిశోధనల్లో సాయం విషయంలో మైథోస్‌కు అసాధారణమైన సామర్థ్యాలున్నట్లు ఇప్పటికే వెల్లడైంది.
ఇక ఫేబుల్ మోడళ్ల విషయానికొస్తే...
⇒ అత్యంత భారీ సాఫ్ట్‌వేర్ కోడ్ బేస్‌లను మైగ్రేట్ చేయడానికి
⇒ కొన్నేసి గంటల పాటు రెగ్యులర్‌గా అటానమస్ పనులు చేయటానికి...
⇒ అడ్వాన్స్‌డ్ కోడింగ్, ఇంజినీరింగ్ టాస్క్‌లు చేయటానికి వాడొచ్చు.
నిషేధం వల్ల నష్టాలేంటి?
⇒ ఆంథ్రోపిక్ విడుదల చేసిన అత్యంత శక్తిమంతమైన మోడళ్లను అమెరికా వెలుపల ఎవరూ యాక్సెస్ చేసుకోలేరు.
⇒ మెరుగైన కోడ్‌ను జనరేట్ చేయటం... బగ్స్‌ను కనిపెట్టడం... భారీస్థాయి సాఫ్ట్‌వేర్ మైగ్రేషన్లను ఈజీగా చేసే సామర్థ్యాన్ని డెవలపర్లు కోల్పోతారు.
⇒ సైబర్ సెక్యూరిటీలోని లోపాలను కనిపెట్టడానికి ఉపయోగపడే అత్యంత ఆధునిక టూల్స్‌ను పరిశోధకులు వాడలేరు.
⇒ అన్నిటికన్నా ప్రధానం... అమెరికా వెలుపల ఉండేవారికి అమెరికాలో ఉండేవారితో పలు అంశాల్లో పోటీపడే సామర్థ్యం తగ్గిపోతుంది. అమెరికన్ కంపెనీలకు ప్రొడక్టివిటీ అడ్వాంటేజ్ పెరిగి... విదేశాల్లోని స్టార్టప్‌ల ఇన్నోవేషన్ సామర్థ్యం స్లో అవుతుంది. అడ్వాన్స్‌డ్ సెమీ కండక్టర్ల మాదిరి ఏఐ సామర్థ్యాలపై కూడా కొన్ని దేశాల ఆధిపత్యం కొనసాగుతుంది.
భారత్‌కు ఇబ్బందులేంటి?
భారత్‌కు ఇది చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే అత్యంత ఆధునికమైన అడ్వాన్స్‌డ్ అమెరికన్ ఏఐ మోడళ్ల యాక్సెస్ మన స్టార్టప్‌లకు ఉండదు. మన సైబర్‌సెక్యూరిటీ సంస్థలు అత్యాధునిక టూల్స్‌ను కోల్పోతాయి. పైపెచ్చు నిషేధం ఎక్కువకాలం కొనసాగితే మన సాఫ్ట్‌వేర్ సంస్థల పోటీ సామర్థ్యం తగ్గొచ్చు. నిశితంగా చూస్తే ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఏఐ చిప్‌లను, సెమీకండక్టర్ పరికరాలను, సూపర్ కంప్యూటర్ల హార్డ్‌వేర్‌ను మాత్రమే నియంత్రించాయి. ఇపుడు ఏఐ మోడల్‌ను సైతం అమెరికా ఓ సాఫ్ట్‌వేర్‌లా కాకుండా కీలకమైన మిలిటరీ టెక్నాలజీలా చూడటం ఆరంభించింది. ఈ కారణాల వల్లే అమెరికా మోడళ్లపై పూర్తిగా ఆధారపడకుండా భారత్‌కు సొంత ఏఐ మోడళ్లు ఉండాలని మోహన్‌దాస్ పాయ్ వంటి టెక్నోక్రాట్లు చేస్తున్న వాదనకు బలం చేకూరుతోంది. ఈ ఏఐ నియంత్రణ మున్ముందు మరిన్ని మలుపులు తిరుగుతుందన్నది కాదనలేని నిజం.
ఆంథ్రోపిక్ కొత్త ఏఐ మోడళ్లు వెనక్కి
వాషింగ్టన్: ట్రంప్ విధానాలతో దేశాలు మాత్రమేకాదు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు సైతం ఇబ్బందులు పడుతున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చుచేసి పరిశోధన పూర్తిచేసి వినియోగదారులకు అందుబాటులోకి తెచి్చన అధునాతన కృత్రిమమేధ (ఏఐ) టూల్స్‌ను కంపెనీలు వెనక్కి(రీకాల్) చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆ జాబితాలో ఇప్పుడు ఏఐ దిగ్గజ సంస్థ ‘ఆంథ్రోపిక్’చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల అందుబాటులోకి తెచి్చన క్లాడ్ ఫేబుల్5, మైథోస్5 ఏఐ మోడళ్లను వెనక్కితీసుకుంటున్నట్లు ఆంథ్రోపిక్ శనివారం ప్రకటించింది.
భద్రతా కారణాలు చూపి వీటిపై అమెరికా ప్రభుత్వం ఆంక్షల విధించడంతో తప్పనిపరిస్థితుల్లో వీటిని మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆంథ్రోపిక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘భద్రత లేని, క్షేమదాయకంకాని మోడళ్లపై ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది. కానీ అత్యంత భద్రమైన మా మోడళ్లకు ఏ సాంకేతిక లోపాల మాటున అడ్డుచెబుతున్నారో ప్రభుత్వం వివరిస్తే బాగుండేది. అప్పుడే ఈ ఆంక్షల ప్రక్రియ పారదర్శకంగా, స్వేచ్ఛగా జరుగుతుందని అంతా భావిస్తారు’అని ఆంథ్రోపిక్ తన అసహనం వ్యక్తంచేసింది.
(రమణమూర్తి మంథా)


