ఆరెస్సెస్‌ వారి నేతాజీ జయంతి వేడుకలు.. విజాతి ధృవాలన్న బోస్‌ కూతురు

Anita Bose Reacts On RSS Netaji Birth Anniversary Celebrations - Sakshi

కోల్‌కతా: స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌(ఐఎన్‌ఏ) వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆరెస్సెస్‌ సన్నద్ధమవుతోంది.  ఈ తరుణంలో.. నేతాజీ కూతురు అనితా బోస్‌(80) స్పందించారు. 

జనవరి 23వ తేదీన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి. ఈ సందర్భంగా.. కోల్‌కతాలోని షాహిద్‌ మినార్‌ గ్రౌండ్‌లో జయంతి వేడుకల నిర్వహణకు ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ హాజరు కానున్నారు. అయితే.. ఈ పరిణామంపై నేతాజీ కూతురు అనిత ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు..

తన తండ్రి పేరును ఆరెస్సెస్‌, బీజేపీలు పాక్షికంగా వాడుకోవాలని యత్నిస్తున్నాయేమో అని అన్నారామె.  ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం.. జాతీయవాద నాయకుడైన తన తండ్రి(నేతాజీ) లౌకికవాదం, సమగ్రత ఆలోచనలు.. పరస్పర విజాతి ధృవాలను, అవి ఏనాడూ కలవవని ఆమె అన్నారు. సిద్ధాంతాల విషయానికొస్తే.. దేశంలోని ఇతర పార్టీల కంటే కాంగ్రెస్‌ పార్టీకి, నేతాజీకి చాలా ఎక్కువ సారూప్యతలు ఉన్నాయన్నారామె.

అన్నింటికి మించి ఆయన లెఫ్టిస్ట్‌ అనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఆరెస్సెస్‌, బీజేపీలు ఆయన వైఖరిని ప్రతిబింబించలేవు. వాళ్లు అతివాదులు, నేతాజీది వామపక్ష భావజాలం అని ఫోన్‌ ద్వారా జర్మనీ నుంచి ఇక్కడి మీడియాతో ఆమె మాట్లాడారు. విభిన్న సమూహాలు నేతాజీ జన్మదినాన్ని వివిధ మార్గాల్లో జరుపుకోవాలని కోరుకుంటాయి. వారిలో చాలా మంది తప్పనిసరిగా ఆయన ఆలోచనలతో ఏకీభవిస్తున్నారు. అయితే.. నేతాజీ ఆశయాలను, ఆలోచనలను స్వీకరించాలని ఆర్‌ఎస్‌ఎస్ భావిస్తే అది ఖచ్చితంగా బాగుంటుంది అని అనిత బోస్‌ వెల్లడించారు. 

నేతాజీ.. ఆరెస్సెస్‌ విమర్శకుడా? అనే ప్రశ్నకు.. ఆ విషయంపై తనకు స్పష్టత లేదని ఆమె బదులిచ్చారు. అయితే.. ఆరెస్సెస్‌ గురించి, నేతాజీ భావజాలం గురించి మాత్రం తనకు స్పష్టత ఉందని, ఈ రెండు పొసగని విషయాలని ఆమె అన్నారు. ముఖ్యంగా నేతాజీ సెక్యులరిజం అనేది ఆరెస్సెస్‌కు సరిపోని అంశమని పేర్కొన్నారామె.

ఇదిలా ఉంటే.. 2021లో తృణమూల్‌ కాంగ్రెస్‌-బీజేపీలు నేతాజీ 125వ జయంతి వేడుకల కోసం పోటాపోటీ పడ్డాయి.  అసెంబ్లీ ఎన్నికల తరుణంలోనే ఆ రెండు పార్టీలు అలాంటి చర్యలకు దిగడం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top