సారీ..రీచార్జ్‌కు డబ్బుల్లేవు

Anganwadi Smart Phones Not Working Govt Not Recharged - Sakshi

బనశంకరి: రాష్ట్రంలో వేలాది గ్రామాలు, పట్టణాల్లో పేద బాలలకు విద్యా, పోషణ సేవలు అందిస్తున్న అంగన్‌వాడీలకు తీవ్ర కష్టం వచ్చింది. డిజిటలీకరణ మాటలకే పరిమితమైంది. అంగన్‌వాడీ కార్యకర్తలు, పర్యవేక్షకులకు అందించిన స్మార్ట్‌ ఫోన్లు అలంకారంగా మిగిలాయి. నిరుపేద కుటుంబాల పిల్లలు, గర్భిణీలు, బాలింతలు సమగ్ర సమాచారం మొత్తం ఆన్‌లైన్లో నమోదై ఉండాలని కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన పథకం ప్రారంభించింది. ప్రతి అంగన్‌వాడీ కి అందించిన స్మార్ట్‌ ఫోన్‌లను ప్రభుత్వం రీచార్జ్‌ చేయకపోవడంతో ఇంటర్నెట్‌ అందక పనిచేయడం లేదు. దీంతో కోట్లాది రూపాయలు ఖర్చుచేసిన పథకం లక్ష్యం నెరవేరలేదు.  

ఆరు నెలలుగా సమస్య 
పోషణ అభియాన కింద 2020లో 62,581 అంగన్‌వాడీ, 3,331 ఉపకేంద్రాలతో పాటు మొత్తం 65, 911 కేంద్రాల కార్యకర్తలకు శామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ–10 ఎస్‌ మోడల్‌ స్మార్ట్‌ఫోన్, ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌  సిమ్‌లను సర్కారు అందజేసింది. కొత్తగా ప్రారంభించిన 1050 అంగన్‌వాడీలకు ఇంకా ఇవ్వలేదు. ఈ పథకానికైన వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60–40 కింద భరిస్తాయి.

ఎయిర్‌టెల్‌కు డబ్బు చెల్లించక సుమారు 6 నెలలుగా 65,911 స్మార్ట్‌ ఫోన్లు మూగబోయాయి. దీనిపై అంగన్‌వాడీలు పై అధికారులకు ఫిర్యాదు చేస్తే నిధుల కొరత అని సమాధానం వచ్చింది. రెండువారాల కిందట బెంగళూరులో జరిపిన రాష్ట్రస్థాయి అంగన్‌వాడీల ఆందోళలోనూ ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. మళ్లీ చేతితో ఫైళ్లు రాయడం, రికార్డుల నిర్వహణ లాంటి పనులు ప్రారంభమయ్యాయి.   

జీతాలు, ప్రోత్సాహక ధనానికి ఇబ్బందులే  
రాష్ట్రంలో 62 వేల అంగన్‌వాడీల్లో 1.24 లక్షల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు పనిచేస్తున్నారు. వీరికి సేవ ఆధారంగా పురస్కారాలు, గౌరవవేతనం పెంచే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. 20 ఏళ్లకు పైబడి సేవలందించినవారికి రూ.1,500, 10 నుంచి 20 ఏళ్లు సరీ్వస్‌ కు రూ.1,250, 10 ఏళ్లలోపు సరీ్వసు ఉన్నవారికి రూ వెయ్యి చొప్పున జీతం పెంచుతామని సీఎం బసవరాజబొమ్మై  బడ్జెట్‌లో ప్రస్తావించారు. కానీ బడ్జెట్‌ ప్రవేశపెట్టి నాలుగు నెలలు గడిచినప్పటికీ గౌరవవేతనం పెంపు వీరికి అందలేదని కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు.

అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు గత 3 నెలలనుంచి జీతాలు కూడా అందలేదని సమాచారం. గత వారం నుంచి చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ అందింది రెండునెలలు వేతనమేనని తెలిపారు. పెండింగ్‌ జీతం కూడా త్వరలోనే మంజూరు చేస్తామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ప్రియాంక తెలిపారు. స్మార్ట్‌ ఫోన్లకు త్వరలో రీచార్జ్‌ చేస్తామని మహిళా శిశుసంక్షేమ శాఖా మంత్రి హాలప్ప ఆచార్‌ తెలిపారు.

సొంత ఖర్చుతో కొందరు  
నిత్యం యాప్‌లో పిల్లలు నమోదు, ఆహార సామగ్రి, గర్భిణీలు సమాచారం నమోదు చేయడానికి అనుకూలంగా ఉండేది. సిమ్‌ రీచార్జ్‌ చేయకపోవడంతో గత ఆరునెలలుగా ఇబ్బందిగా ఉందని అంగన్‌వాడీ కార్యకర్త లక్ష్మీ తెలిపారు. ఇబ్బందులు పడలేక కొందరు కార్యకర్తలు సొంత డబ్బుతో రీచార్జ్‌ చేసుకున్నట్లు చెప్పారు. 

(చదవండి: ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ సరదా.. రిజర్వాయర్‌ ఎత్తైన అంచుకు వెళ్లి ఫొటో దిగుతూ..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top