టపాసులతో హత్యాయత్నం.. ఏడ్చేసిన మంత్రి

AMMK Party Murder Attempt:TN Minister Kadambur Raju Cries - Sakshi

చెన్నె: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ ప్రచార సమయంలో తమ ప్రత్యర్థులు తనను చంపేసేందుకు కుట్ర పన్నారని ఓ మంత్రి ఏడ్చేశారు. తనను ఒంటిరిని చేసి పటాకులు పేల్చి చంపేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటన తమిళ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఐటీ శాఖ మంత్రి కదంపూర్‌ రాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవిల్‌పట్టిలో ఆదివారం పర్యటించారు. ప్రచారం చేస్తుండగా ప్రత్యర్థి పార్టీ వారు కూడా ప్రచారానికి వచ్చారు. ఈ సమయంలో వివాదం ఎందుకు అని చడీచప్పుడు లేకుండా వెళ్తుంటే పటాకులు పెద్ద ఎత్తున పేల్చి వాటిని తన కాన్వాయ్‌పై వదిలారని మంత్రి రాజు ఆరోపించారు. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగమ్‌ (ఏఎంఎంకే) పార్టీ నాయకులు తమ కార్లతో అడ్డగించి అనంతరం 5 వేల పటాకుల లడీ పేల్చారని చెప్పారు. మంటలు తనకు సమీపంలో వచ్చాయని వాపోయారు. కొద్దిలో నా ప్రాణం పోయేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై అన్నాడీఎంకే జాతీయ కార్యదర్శి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. అయితే కోవైల్‌పట్టి నియోజకవర్గంలో శశికళ మేనల్లుడు, ఏఎంఎంకే పార్టీ అధినేత టీటీవీ దినకరన్‌ పోటీ చేస్తున్నారు. అందుకే ఇక్కడ ఏఎంఎంకే పార్టీ నాయకులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రిపై దాడి చేశారని ప్రచారం సాగుతోంది. ఈ ఘటనపై అన్నాడీఎంకే, ఏఎంఎంకే పార్టీల మధ్య వివాదం ఏర్పడింది. 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీకి ఒకేదశలో ఏప్రిల్‌ 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు మే 2వ తేదీన వెలువడనున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top