
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దీపావళి సరదా విచారాన్ని నింపింది. వెలుగులు నింపాల్సిన దీపావళి 14 మంది చిన్నారుల జీవితాల్లో అంధకారాన్ని నింపేసింది. మధ్యప్రదేశ్‌లో దీపావళి రోజున నిషేధిత 'కార్బైడ్ గన్'తో ఆడుతూ 14 మంది పిల్లలు కంటి చూపు కోల్పోయారు. కేవలం మూడు రోజుల్లోనే, రాష్ట్రవ్యాపితంగా 122 మందికి పైగా పిల్లలు తీవ్రమైన కంటి గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.
దీపావళి అంటే చిన్న పిల్లలు పండుగే. కానీ కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే జరిగే నష్టానికి ప్రతీకగా నిలిచింది. 60 మందికి పైగా గాయపడగా, వారిలో ఎక్కువ మంది 8 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలున్నారు. "కార్బైడ్ పైపు తుపాకులు చాలా ప్రమాదకరమైనవి. ఈ తుపాకుల వాడకం వల్ల గాయపడిన 60 మంది ఇప్పటికీ రాష్ట్ర రాజధానిలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారు" అని భోపాల్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ (CMHO) మనీష్ శర్మ అన్నారు.
ప్రతి దీపావళి బాణసంచా కాల్చడంలో కొత్త ట్రెండ్ విస్తరిస్తోంది. రాకెట్ల వరకు స్పార్క్లర్ల వరకు నెలకొన్న క్రేజ్ ప్రాణాంతకంగా మారింది. "కార్బైడ్ గన్" లేదా "దేశీ ఫైర్‌క్రాకర్ గన్" కారణంగా 14 మంది కంటి చూపు కోల్పోయారు. ప్రభుత్వ నిషేధం ఉన్నప్పటికీ ఈ కార్బైడ్ తుపాకులను" బహిరంగంగా అమ్ముతున్నారు. రూ. 150 నుండి రూ. 200 మధ్య దొరికే ఇవి గన్నులు బాంబుల్లా పేలాయి.
తీవ్ర గాయాలతో బాధపడుతున్న, చూపుకోల్పోయిన బాధితుల బాధలు వర్ణనాతీం. ఇంట్లో తయారుచేసిన కార్బైడ్ తుపాకీని కొన్నా. అది పేలింది, నా కన్ను పూర్తిగా కాలిపోయింది. నాకు ఏమీ కనిపించడం లేదు అంటూ హమీడియా ఆసుపత్రిలో ప్రస్తుతం కోలుకుంటున్న పదిహేడేళ్ల నేహా కన్నీటి పర్యంతమైంది. దాదాపు బాధితులందరిదీ ఇదే ఘోష. అంతేకాదు భోపాల్, ఇండోర్, జబల్‌పూర్ , గ్వాలియర్‌లోని ఆసుపత్రులలో, కంటి వార్డులు ఈ తుపాకుల వల్ల గాయపడినవారితో కిక్కిరిసిపోయాయి. భోపాల్‌లోని హమీడియా ఆసుపత్రిలో మాత్రమే, 72 గంటల్లో 26 మంది పిల్లలు చేరారు.
వీటిని చట్టవిరుద్ధంగా విక్రయించినందుకు విదిష పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశామని తక్షణ చర్యలు తీసుకున్నామని ఇన్‌స్పెక్టర్ ఆర్‌కె మిశ్రా తెలిపారు. స్థానిక సంతలు, రోడ్డు పక్కన ఉన్న స్టాళ్లలో తుపాకులను "మినీ ఫిరంగులు"గా అమ్ముతున్నారని, వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఈ ప్రమాదకరమైన ధోరణి వెనుక ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ , యూట్యూబ్ షార్ట్స్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి."ఫైర్‌క్రాకర్ గన్ ఛాలెంజ్" అని ట్యాగ్ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయనీ , వీటిని చూసి యవత నేర్చుకుంటారని మండిపడ్డారు తల్లిదండ్రులు.