ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. సీఎం సంచలన నిర్ణయం

All Government Departments Five Days Working In week - Sakshi

ఇంపాల్‌: మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అన్ని కార్యాలయాలు, ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని చేయనున్నాయి.  అంటే వారంలో ప్రభుత్వ ఉద్యోగుల పని దినాలను ప్రభుత్వం ఐదు రోజులకు కుదించింది. 

మార్చి 22న సీఎం బీరెన్ సింగ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మణిపూర్‌ ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ సునంద తోక్‌చోమ్‌ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ఒక్క వెకేషన్ డిపార్ట్‌మెంట్ మినహా అన్ని ఆఫీసులకు ఇదే నియవర్తించనుంది. కాగా, ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఆయా కార్యాలయల టైమింగ్స్‌ను కూడా కుదించారు. 

మార్చి నుంచి అక్టోబర్ వరకు ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పని చేయనున్నాయి. ఇక శీతాకాలమైన నవంబర్-ఫిబ్రవరిలో అరగంట తగ్గించి ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు కార్యాలయాలు తెరిచి ఉంటాయని తెలిపారు. మధ్యాహ్నం 1 నుంచి 1.30 గంటల వరకు భోజన విరామం ఉంటుందని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలు కూడా ఐదు రోజుల్లో ఉదయం 8 గంటలకే తెరుచుకోనున్నాయి. 

అయితే, సెలవు దినాల్లో అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఆయా విభాగాలు రోస్టర్ విధానాన్ని రూపొందించనున్నాయి. సీఎం బీరెన్ సింగ్ తన ప్రభుత్వం మొదటి వంద రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాల గురించి ప్రకటించారు. అందులో భాగంగా మొదటగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top