తిరిగి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండింగ్
న్యూఢిల్లీ: బ్రిటన్‌లోని లండన్ హీత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన ఎయిర్‌ఇండియా ఏ350రకం విమానం సాంకేతిక సమస్యలతో తిరిగొచ్చి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగాల్సి వచ్చింది. సౌదీ అరేబియా గగనతంలోకి ప్రవేశించాక సాంకేతిక సమస్య తలెత్తడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విమానం మళ్లీ ఢిల్లీకి వెనుతిరగాల్సి వచ్చిందని ఎయిర్‌ఇండియా అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు.
గతవారం రోజుల వ్యవధిలో ఎయిర్‌ఇండియా విమానం మార్గమధ్యంలో యూటర్న్ తీసుకోవడం ఇది రెండోసారి. ‘‘గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి ఏ350–900 రకం వీటీ–జేఆర్‌ఎఫ్ సిరీస్ ఎయిర్‌ఇండియా విమానం లండన్‌కు బయల్దేరింది. నాలుగు గంటల్లో 3,300 కిలోమీటర్లు ప్రయాణించి సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించింది. అప్పుడు విమానంలో కొన్ని శబ్దాలు పెద్దగా విని్పంచాయి. దీంతో ముందుజాగ్రత్తగా వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. ముందుకు, వెనక్కి అలా మొత్తంగా ఏడు గంటలపాటు ప్రయాణించి ఢిల్లీలో మధ్యాహ్నం 12.30 గంటలకు ల్యాండ్ అయింది.
విమానంలోని వారంతా సురక్షితంగా ఉన్నారు. ఘటనపై సాంకేతిక బృందం సమగ్ర స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు పూర్తవడానికి మరింత సమయం పడుతుంది’’అని అధికార ప్రతినిధి వివరించారు. విమానంలో ఎంత మంది ఉన్నారనే వివరాలు తెలియరాలేదు. ఇదే విమానం సరిగ్గా 11 రోజుల క్రితం న్యూయార్క్‌లోని జాన్‌ఎఫ్ కెన్నడీ ఎయిర్‌పోర్ట్ నుంచి వస్తూ మార్గమధ్యంలో సాంకేతికసమస్యల బారినపడింది. దీంతో గమ్యస్థానం ఢిల్లీకి బదులుగా మధ్యలోనే ఐర్లాండ్‌లోని షానన్ నగరంలో ల్యాండ్ అయింది. ఏ350–900 రకం విమానాలను గత ఏడాది జనవరి నుంచి ఎయిర్‌ఇండియా నడుపుతోంది. గత వారం ఢిల్లీ నుంచి బయల్దేరి కెనడాలోని వాంకోవర్‌కు చేరుకోవాల్సిన ఎయిర్‌ఇండియా విమానం చైనా గగనతలంలోకి చేరుకోగానే సాంకేతిక సమస్యల కారణంగా మళ్లీ ఢిల్లీకే తిరిగిరావడం తెల్సిందే.


