Air Chief Marshal: వాయుసేనాధిపతిగా వీఆర్‌ చౌదరి

Air Chief Marshal VR Chaudhari takes over as Indian Air Force chief - Sakshi

ప్రస్తుత చీఫ్‌ భదౌరియా నుంచి బాధ్యతలు స్వీకరణ

ఆపరేషన్‌ మేఘదూత్, ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ వంటి మిషన్లలో పాల్గొన్న చౌదరి

సాక్షి, న్యూఢిల్లీ: భారత వైమానిక దళం నూతన చీఫ్‌గా ఎయిర్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు వైస్‌ చీఫ్‌గా ఉన్న ఆయన గురువారం మధ్యాహ్నం ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ రాకేశ్‌ కుమార్‌ సింగ్‌ భదౌరియా నుంచి బాధ్యతలు చేపట్టారు. దీంతో వీఆర్‌ చౌదరి దేశ 27 వ ఎయిర్‌ స్టాఫ్‌ చీఫ్‌ అయ్యారు. వీఆర్‌ చౌదరి పూర్తి పేరు వివేక్‌ రామ్‌ చౌదరి. ఆయన నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ) పూర్వ విద్యార్థి. అంతేగాక డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు.

కాగా ఈ ఏడాది జూలై 1న, వైమానిక దళంలో రెండవ అతి ముఖ్యమైన స్థానం అయిన వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌ స్టాఫ్‌గా ఎయిర్‌ మార్షల్‌ హర్జిత్‌ సింగ్‌ అరోరా స్థానంలో చౌదరి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన విధులను బాధ్యతతో నిర్వహిస్తానని చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశ భద్రతను, సార్వభౌ మత్వాన్ని కాపాడటమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఆయుధాలకు కొత్త ఆయుధాలను జత చేయడం, కొత్త వేదికలను ఉపయోగించుకోవడం తన ప్రాధామ్యమని తెలిపారు. అయితే గురువారం వాయుసేన అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన చౌదరి మూడేళ్ల పాటు ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ పదవిలో ఉండనున్నారు.  
(చదవండి: లైంగిక దాడి: బిర్యాని తినిపించి.. మద్యం తాగించి..)

వాయుసేనలో బాధ్యతలు
1982 డిసెంబర్‌లో వివేక్‌ రామ్‌ చౌదరి ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ స్ట్రీమ్‌లో ఫైటర్‌ పైలట్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత మిగ్‌ –21, మిగ్‌ –23 ఎమ్‌ఎఫ్, మిగ్‌–29, సు–30 ఎమ్‌కేఐ వంటి యుద్ధ విమానాలను నడిపారు. 3,800 గంటలకు పైగా యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఉంది. ప్రస్తుతం వాయుసేన చీఫ్‌ అయ్యేముందు ఎయిర్‌ఫోర్స్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఎయిర్‌ స్టాఫ్‌ డిప్యూటీ చీఫ్‌గా, తూర్పు కమాండ్‌లో సీనియర్‌ ఎయిర్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌గా పనిచేశారు.

జూలైలో ఎయిర్‌ స్టాఫ్‌ వైస్‌ చీఫ్‌ కావడానికి ముందు, పాకిస్తాన్, చైనాతో సరిహద్దులలోని కొన్ని ప్రాంతాల భద్రతకు బాధ్యత వహించే వెస్ట్రన్‌ ఎయిర్‌ కమాండ్‌కు కమాండర్‌–ఇన్‌–చీఫ్‌గా పనిచేశారు. తూర్పులద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం నెలకొన్న సమయంలోనే వెస్ట్రన్‌ ఎయిర్‌ కమాండ్‌ చీఫ్‌గా ఎయిర్‌ మార్షల్‌ వివేక్‌ చౌదరిని నియమించారు. అంతేగాక గతంలో ఆపరేషన్‌ మేఘదూత్, ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ వంటి ఎయిర్‌ ఫోర్స్‌ చేపట్టిన కొన్ని ముఖ్యమైన మిషన్లలో చౌదరి భాగస్వాములయ్యారు. గతంలో ఫ్రంట్‌లైన్‌ ఫైటర్‌ స్క్వాడ్రన్‌కు కమాండింగ్‌ అధికారిగా వ్యవహరించారు. హైదరాబాద్‌లోని దుండిగల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ డిప్యూటీ కమాండెంట్‌గా, అసిస్టెంట్‌
చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌ స్టాఫ్‌ ఆపరేషన్స్‌ బాధ్యతలు నిర్వహించారు.
(చదవండి: వరుస సంక్షోభాలు.. చైనాకు భారీ దెబ్బే: గోల్డ్‌మన్‌ సాక్స్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top