కృత్రిమ మేధ (AI) రంగంలో ప్రపంచ శక్తిగా ఎదగాలని భారత్ భారీ ప్రణాళికలు రచిస్తోంది. వేల కోట్ల పెట్టుబడులతో కొత్త డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక సదుపాయాలు, ఏఐ కంప్యూటింగ్ హబ్‌లు ఏర్పాటవుతున్నాయి. అయితే ఈ డిజిటల్ కలలకు ఇప్పుడు ఊహించని సవాల్ ఎదురు కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా నిర్మించబోతున్న డేటా సెంటర్లపై నిర్వహించిన తాజా అధ్యయనం భారత్‌కు హెచ్చరికలు జారీ చేసింది. అది విద్యుత్ కొరతో.. నీటి కొరతో కాదంట..
ఏఐ విప్లవం ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్‌బాట్లు, జనరేటివ్ ఏఐ, క్లౌడ్ సేవలు, డిజిటల్ లావాదేవీలు.. ఇవన్నీ నడవాలంటే భారీ డేటా సెంటర్లు అవసరం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, టెక్ కంపెనీలు బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. భారత్ కూడా ఈ పోటీలో ముందంజలో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. డేటా లోకలైజేషన్ విధానాలు, పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం, ఏఐ అవసరాలు దేశాన్ని ప్రపంచ డేటా సెంటర్ హబ్‌గా మార్చే దిశగా నడిపిస్తున్నాయి. కానీ, వాతావరణ మార్పుల ప్రభావం దేశంలోని డేటా సెంటర్ల పనితీరును తీవ్రంగా దెబ్బతీయొచ్చని ఓ నివేదిక చెబుతోంది.
భారత్‌లో వేగవంతమైన ఏఐ విస్తరణకు ప్రకృతి నుంచి సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. తాజాగా విడుదలైన ‘‘2026 Global Analysis of Planned Data Centres for Physical Climate Risk and Resilience’’ నివేదిక ఈ వివరాలను సమగ్రంగా వెల్లడించింది. వాతావరణ ప్రమాదాలపై పరిశోధనలు చేసే ఎక్స్‌డీఐ (Cross Dependency Initiative - XDI) సంస్థ ఈ అధ్యయనాన్ని చేపట్టింది.
ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ దశలో ఉన్న లేదా ప్రణాళికలో ఉన్న 2,595 డేటా సెంటర్లను పరిశీలించిన ఈ అధ్యయనం ఒక కీలక విషయాన్ని గుర్తించింది. ఇప్పటివరకు డేటా సెంటర్ల గురించి చర్చలు ప్రధానంగా విద్యుత్ వినియోగం, నీటి అవసరాల చుట్టూనే తిరిగాయి. కానీ భవిష్యత్తులో అసలు ముప్పు నేరుగా వాతావరణ మార్పుల వల్ల రావచ్చని ఈ నివేదిక చెబుతోంది.
భారత్ పరిస్థితి ఏంటి?..
ఈ విశ్లేషణ ప్రకారం వాతావరణ సంబంధిత ప్రమాదాల తీవ్రతలో భారత్ ప్రపంచవ్యాప్తంగా 11వ స్థానంలో ఉంది. ముఖ్యంగా దేశంలోని కీలక టెక్నాలజీ కేంద్రాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు.. ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా డేటా సెంటర్ల కార్యకలాపాలు దెబ్బతినే ప్రమాదం ఉన్న టాప్-30 ప్రాంతాల్లో చోటు దక్కించుకున్నాయి.
ఇది సాధారణ హెచ్చరిక కాదు. ఎందుకంటే భారత్‌లో ప్రస్తుతం డేటా సెంటర్ పెట్టుబడుల పోటీ ఎక్కువగా ఈ రాష్ట్రాల చుట్టూనే తిరుగుతోంది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు ఇప్పటికే ప్రధాన డేటా హబ్‌లుగా ఎదుగుతున్నాయి. ఇక్కడే భవిష్యత్తు ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం కూడా వేగంగా సాగుతోంది.
వేడి ఎందుకు అంత ప్రమాదకరం?
వరదలు వస్తే భవనాలు దెబ్బతింటాయి. తుఫాన్లు వస్తే మౌలిక సదుపాయాలు నాశనం అవుతాయి. కానీ తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావం అంత స్పష్టంగా కనిపించదు. అయినప్పటికీ అది మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. డేటా సెంటర్లలో వేల సంఖ్యలో సర్వర్లు నిరంతరం పనిచేస్తుంటాయి. ఇవి సహజంగానే భారీగా వేడిని ఉత్పత్తి చేస్తాయి. అందుకే వాటిని చల్లబరచడానికి అధునాతన కూలింగ్ వ్యవస్థలు అవసరం. బయట ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ కూలింగ్ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి.
అంతేకాదు..
విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుంది
పరికరాల సామర్థ్యం తగ్గుతుంది
సర్వర్ వైఫల్యాల ప్రమాదం పెరుగుతుంది
సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది
నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి
అంటే డేటా సెంటర్ భవనం సురక్షితంగానే ఉన్నా.. తీవ్ర వేడి కారణంగా దాని పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
అసలు ముప్పు భవనం బయటే ఉందా?
ఈ నివేదికలో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. డేటా సెంటర్ ఎంత బలంగా నిర్మించినా అది ఒంటరిగా పనిచేయదు. దానికి విద్యుత్ సరఫరా, నీటి వనరులు, టెలికాం నెట్‌వర్క్‌లు, రవాణా వ్యవస్థలు, సరఫరా గొలుసులు అవసరం. ఒకవేళ తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా విద్యుత్ గ్రిడ్‌లు విఫలమైతే? నీటి సరఫరా నిలిచిపోతే? రవాణా వ్యవస్థలు స్తంభిస్తే? డేటా సెంటర్ నేరుగా దెబ్బతినకపోయినా దాని కార్యకలాపాలు ఆగిపోవచ్చు.
యూరప్‌లో నిర్వహించిన మరో అధ్యయనాన్ని ఉదహరిస్తూ ఎక్స్‌డీఐ ఒక కీలక విషయాన్ని పేర్కొంది. నేరుగా భవనానికి జరిగే నష్టం కంటే ఇలాంటి పరోక్ష మౌలిక సదుపాయాల వైఫల్యాల వల్ల కలిగే ఆర్థిక నష్టం పది రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అంచనా.
ప్రపంచానికి కూడా ఇదే సమస్య
ఈ ముప్పు కేవలం భారత్‌కే పరిమితం కాదు. దక్షిణాసియా, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా ప్రాంతాలు మొత్తం అధిక ప్రమాద జోన్‌లుగా గుర్తించబడ్డాయి. ప్రస్తుతం దక్షిణాసియాలో ప్రణాళికలో ఉన్న డేటా సెంటర్లలో సుమారు 12 శాతం ఇప్పటికే అధిక ప్రమాద కేటగిరీలో ఉన్నాయి. అధిక కార్బన్ ఉద్గారాలు కొనసాగితే శతాబ్దం చివరినాటికి ఈ ప్రమాదం మూడింతలకు పైగా పెరిగే అవకాశం ఉందని నివేదిక హెచ్చరిస్తోంది. భారత్‌తో పాటు బ్రెజిల్, మెక్సికో, ఇండోనేషియా, స్పెయిన్ వంటి దేశాల్లో కూడా తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా కార్యకలాపాలకు అంతరాయం కలిగే ప్రమాదం అధికంగా ఉందని పేర్కొంది.
బీమా ఖర్చులు కూడా..
డేటా సెంటర్లపై పెట్టుబడులు పెరుగుతున్న కొద్దీ బీమా సంస్థలు కూడా వాతావరణ ప్రమాదాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత రీఇన్సూరెన్స్ సంస్థ Swiss Re అంచనా ప్రకారం ప్రస్తుతం సుమారు 10.6 బిలియన్ డాలర్లు ఉన్న డేటా సెంటర్ బీమా మార్కెట్ 2030 నాటికి 24.2 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో వాతావరణ ప్రమాదాలు పెరిగితే బీమా ప్రీమియంలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇది కొత్త ప్రాజెక్టుల వ్యయాలను మరింత పెంచుతుంది.
మరి పరిష్కారం మాటేంటి?..
అయితే ఇది అనివార్యమైన సంక్షోభం కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రణాళిక దశలో ఉన్న డేటా సెంటర్ల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని సూచిస్తున్నారు.
సరైన ప్రాంతాల ఎంపిక
అధునాతన కూలింగ్ టెక్నాలజీలు
వాతావరణ నిరోధక డిజైన్లు
బలమైన విద్యుత్ బ్యాకప్ వ్యవస్థలు
నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం
పునరుత్పాదక ఇంధనాల వినియోగం.. ఇలాంటి చర్యలు భవిష్యత్తు ప్రమాదాలను తగ్గించగలవని పేర్కొంటున్నారు.
ఏఐ యుగంలో డేటా సెంటర్లు కొత్త కాలపు ఫ్యాక్టరీలుగా మారుతున్నాయి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఇవే వెన్నెముక. భారత్ ప్రపంచ ఏఐ శక్తిగా ఎదగాలంటే కేవలం పెట్టుబడులు ఆకర్షించడం సరిపోదు. ఆ మౌలిక సదుపాయాలు రాబోయే దశాబ్దాల్లో పెరుగుతున్న వేడి, తీవ్రమవుతున్న వాతావరణ మార్పులను కూడా తట్టుకునేలా ఉండాలి. లేకపోతే నేటి డిజిటల్ కలలు.. రేపటి క్లైమేట్ రిస్క్‌ల ముందు నిలబడలేకపోవచ్చు. ఇదే తాజా నివేదిక ఇస్తున్న అసలు హెచ్చరిక.


