ఐసిస్‌ కుట్ర కేసు..15 మంది దోషులకు శిక్ష

15 ISIS Terrorists Sentenced In Conspiracy Case - Sakshi

ప్రకటించిన ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయమూర్తి

దోషుల్లో హైదరాబాదీ నఫీజ్‌ఖాన్‌కు పదేళ్ల జైలు

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల విస్తరణకు ప్రయత్నించిన ఐసిస్‌ (ఐఎస్‌ఐఎస్‌) కుట్ర కేసులో దోషులుగా తేలిన 15 మందికి శిక్ష ఖరారుచేస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ పర్వీన్‌సింగ్‌ తీర్పు వెలువరించారు. నిందితులపై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలు మోపుతూ వివిధ సెక్షన్ల కింద ఎన్‌ఐఏ 2015 డిసెంబరులో కేసు నమోదు చేసింది. వేర్వేరు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి ముస్లిం యువకులను రిక్రూట్‌ చేసుకోవడం ద్వారా భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించాలని నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ కుట్రపన్నింది. దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో తనిఖీలు చేసి 19 మంది నిందితులను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఐసిస్‌ కోసం పని చేయడానికి, ఉగ్రవాద చర్యలకు పాల్పడటానికి కొందరు యువతను వీరంతా జునూద్‌–ఉల్‌–ఖిలాఫా–ఫిల్‌–హింద్‌ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. సిరియాలో ఉన్న ఐసిస్‌ మీడియా చీఫ్‌ యూసుఫ్‌–అల్‌–హిందీ అలియాస్‌ షఫీ అర్మర్‌ అలియాస్‌ అంజన్‌భాయ్‌ ఆదేశాలతో భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాల విస్తరణ కోసం వీరు పనిచేశారు.

ఐసిస్‌ ఉగ్రవాదులను ఎన్‌ఐఏ అరెస్టుచేసిన తరువాత, వారి కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. వారి ఇతర సహచరులను గుర్తించి, తదుపరి ప్రణాళికలను కనిపెట్టి.. ఇప్పటికే ఐసిస్‌లో చేరడానికి వెళ్లిన పలువురు సానుభూతిపరులను మధ్యప్రాచ్యంలోని వివిధ ప్రదేశాలలో అడ్డగించి తిరిగి భారత్‌కు రప్పించారు. ఎన్‌ఐఏ నిర్వహించిన దర్యాప్తుతో భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఐసిస్‌ సభ్యులకు ఆశ్రయం దొరకడం ఆగిపోయింది. దర్యాప్తు పూర్తయిన తరువాత, 2016–2017లో 16 మంది నిందితులపై ఎన్‌ఐఏ చార్జిషీట్లు దాఖలు చేసింది. 16.10.2020న 15 మంది నిందితులను దోషులుగా నిర్ధారించి ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయమూర్తి కఠినమైన జైలు శిక్ష, జరిమానా విధించారు. ఇందులో నఫీజ్‌ ఖాన్‌కు పదేళ్ల శిక్షతో పాటుగా రూ.1,03,000  జరిమానా విధించారు. ముదబ్బీర్‌ ముష్తాక్‌ షేక్‌కు ఏడేళ్ల జైలు, రూ.65,000 జరిమానా విధించారు. అబూ అనాస్‌కు ఏడేళ్ల జైలు, రూ.48 వేల జరిమానా, ముఫ్తీ అబ్దుస్‌ సమీకి ఏడేళ్ల జైలు, రూ.50,000 జరిమానా, అజార్‌ ఖాన్‌కు ఆరేళ్ల జైలు, రూ.58,000 జరిమానా విధించారు. అమ్జాద్‌ ఖాన్‌కు ఆరేళ్ల జైలు రూ.78,000 జరిమానా విధించారు. షరీఫ్‌ మొయినుద్దీన్, ఆసిఫ్‌ అలీ, మహ్మద్‌ హుస్సేన్, సయ్యద్‌ ముజాహిద్, నజ్ముల్‌ హుడా, మహ్మద్‌ ఒబేదుల్లా, ఎండీ అలీమ్, ఎండీ అఫ్జల్, సోహైల్‌ అహ్మద్‌కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.38 వేల జరిమానా చొప్పున విధించారు. 

దోషుల్లో నలుగురు హైదరాబాదీలు..
ఈ కేసులోని 15 మందిలో నలుగురు హైదరాబాదీలు ఉన్నారు. టోలిచౌకికి చెందిన ఒబేదుల్లాఖాన్‌ (కంప్యూటర్‌ స్పేర్‌పార్ట్స్‌ దు కాణం), షరీఫ్‌ మొయినుద్దీన్‌ఖాన్‌ (ఎలక్ట్రిక ల్‌ కాంట్రాక్టర్‌), మాదాపూర్‌కు చెందిన అబూ అనాస్‌ (సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి), నఫీజ్‌ఖాన్‌ 2016 జనవరిలో అరెస్టయ్యారు. అప్ప ట్లో వీరి నుంచి పేలుడు పదార్థాలు, తుపాకీలను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top