అర్హులకు ఆటంకం కలిగించొద్దు..
నారాయణపేట: సదరం ధ్రువపత్రాల జారీ ప్రక్రియలో అక్రమాలు, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఈ నెల 22న ‘సదరం దందా..?’ శీరిక్షన ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన కలెక్టర్ వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) సుజాతను విచారణ అధికారిగా నియమించారు. విచారణలో డీఆర్డీఏ సదరం విభాగంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ప్రవీణ, రాజేందర్ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో పాటు రికార్డుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినట్లు బయటపడింది. అనర్హులకు ధ్రువపత్రాల జారీలో కొందరు వైద్యులకు సహకరించినట్లు, ఇందుకు సంబంధించిన రికార్డులను ధ్వంసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో వారిని విధుల నుంచి తొలగిస్తూ శనివారం కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అనర్హులకు సదరం ధ్రువపత్రాల మంజూరు, సంబంధిత రికార్డులను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయడం వంటి అంశాలు విచారణలో వెలుగు చూసినట్లు కలెక్టర్ ప్రకటించారు. తొలగింపు ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని డీఆర్డీఓ ఎన్.వెంకట్రాములును ఆదేశించారు. సదరం శిబిరాల నిర్వహణకు అంతరాయం కలగకుండా వారి స్థానంలో డీఆర్డీఏలో అందుబాటులో ఉన్న ఉద్యోగులకు
బాధ్యతలు అప్పగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ధ్రువపత్రాల జారీలో నిర్లక్ష్యం లేదా అక్రమాలకు పాల్పడినట్లు తేలిన వైద్యులపైనా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
22వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం
చేయూత పింఛన్ల మంజూరు విషయంలో ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. అనర్హులకు పింఛన్లు మంజూరు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అదే సమయంలో అర్హులైన ఒక్కరికీ పింఛను అందించాలని, అనవసర జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, అర్హులకు అన్యాయం జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించిన కలెక్టర్
అనర్హులకు ధ్రువపత్రాల జారీలోసహకారం.. రికార్డుల ధ్వంసం
వైద్యుల పాత్రపైనా విచారణ.. తప్పుచేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక


