నేరాల నియంత్రణపై ప్రత్యేక నిఘా | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణపై ప్రత్యేక నిఘా

Nov 29 2026 3:11 PM | Updated on Nov 29 2026 3:11 PM

నారాయణపేట: జిల్లాలో నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని.. ప్రాణాలు కాపాడితే రూ.25 వేల ప్రోత్సాహకం అందిస్తామని ఎస్పీ డా. జి.వినీత్‌ తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. నేరాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే.. ముందస్తు నిఘా, సమర్థవంతమైన చర్యలతో అరికట్టడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఈ నెలలో 9 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. దొంగతనాలు, ఇతర నేరాల నియంత్రణకు అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో వాహన తనిఖీలు, ప్రత్యేక నాకాబందీలు నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్లకు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి, వారి సమస్యలపై తక్షణమే స్పందించాలన్నారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని సూచించారు. ఫోన్‌ ద్వారా సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఆన్‌సైట్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించారు.

సీసీ కెమెరాలు తప్పనిసరి..

ప్రతి గ్రామంలో కనీసం నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సీసీ కెమెరాల ద్వారా నేరాల నియంత్రణతో పాటు నేరస్తులను త్వరగా గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్‌స్పాట్‌లను సంబంధిత శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు భద్రతపై వాహనదారులు, ఉద్యోగులు, విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం అందించే పీఎం–రాహత్‌ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రమాద బాధితులను సకాలంలో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి రహవీర్‌ పథకం కింద రూ.25 వేల నగదు ప్రోత్సాహకం, ప్రశంసాపత్రం అందించే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని కోరారు. ప్రమాదం జరిగిన వెంటనే 112కు సమాచారం అందించాలని సూచించారు. సైబర్‌ నేరాలు, బాల్యవివాహాలు, దొంగతనాల నివారణతో పాటు మహిళలు, చిన్నారుల భద్రతపై గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐలు శివశంకర్‌, రాంలాల్‌, భగవంత్‌రెడ్డి, సైదులు, రవిబాబు, ఆర్‌ఐ విజయభాస్కర్‌, శిక్షణ డీఎస్పీలు, ఎస్‌ఐలు, ఎస్బీ, డీసీఆర్బీ, ఐటీ కోర్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement