నారాయణపేట ఎడ్యుకేషన్: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశానికిగాను శనివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు తెలిపారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, లిటిల్స్టార్ ఉన్నత పాఠశాల, గురుకుల బాలికల పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని.. మొత్తం 885 మంది విద్యార్థులకుగాను 761 మంది హాజరయ్యారని వివరించారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 309 మంది విద్యార్థులకుగా 259 మంది హాజరుకాగా.. 50 మంది గైర్హాజరయ్యారని, అలాగే లిటిల్స్టార్ ఉన్నత పాఠశాలలో 288 మంది విద్యార్థులకుగాను 248 మంది హాజరుకాగా.. 40 మంది రాలేదని తెలిపారు. అదేవిధంగా గురుకుల బాలికల ఉన్నత పాఠశాలలో 288 మంది విద్యార్థులకుగాను 254 మంది హాజరై 34 మంది గైర్హాజరయ్యారని చెప్పారు. మొత్తంగా 85.98 హాజరు శాతం నమోదైందన్నారు.
పటిష్ట పోలీసు బందోబస్తు..
మూడు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శిక్షణ డీఎస్పీలు శ్రీనికేష్, దైనంపల్లి ప్రవీణ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భద్రత చర్యలు చేపట్టారు.


