జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి
మాగనూర్: జంక్‌ఫుడ్ అధికంగా తీసుకోవడం ద్వారా ప్రజలు అనారోగ్యం పాలవుతారని, బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ జయచంద్రమోహన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో పాటు ఆశా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిప్స్, నామ్‌కీన్స్, కుకీలను తీసుకునే బదులు వాల్‌నట్స్ వంటివి తీసుకోవాలన్నారు. చాలా మంది సన్నగా.. ఫీట్‌గా ఉండటానికి డైట్ పాటిస్తారని, కానీ జంక్‌ఫుడ్ చూడగానే డైట్ విషయం పక్కనబెట్టి పుష్టిగా లాగించేస్తారన్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో సైతం ప్లాస్టిక్ వాడకం రోజురోజుకూ పెరిగిపోతుందని, అది ఆరోగ్యానికి ముప్పనే విషయం గుర్తించుకోవాలని సూచించారు. ఆనంతరం ఆస్పత్రి రికార్డులను తనిఖీ చేసి రోగులతో మాట్లాడారు. వారి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరాతీశారు. వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి అఫ్రోజ్, రాణితేజశ్విణి, వైద్య సిబ్బంది, ఆశాకార్యకర్తలు తదితరులు ఉన్నారు.


