ప్రభుత్వ భూములుపర్యవేక్షించాలి
కోస్గి రూరల్: ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను స్థానిక అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాసులు సూచించారు. మండలంలోని తోగాపూర్‌లో సర్వే నంబరు 150లో గుట్ట, రాయి ప్రాంతం కలిపి 385 ఎకరాల భూమి ఉండేదన్నారు. దానిని చాలా ఏళ్ల క్రితమే ప్రభుత్వం పలువురు రైతులకు అసైన్‌మెంట్ కింద ఇచ్చిందని తెలిపారు. ఈ సర్వే నంబర్‌లో ప్రస్తుతం 35 ఎకరాల్లో ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో హెల్ప్‌లెస్ సెంటర్, రికార్డుల గదులు, పలు సెక్షన్లను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో డీటీ కరుణాకర్, ఆర్‌ఐ సుభాష్‌రెడ్డి, సర్వేయర్ అరుణ తదితరులు ఉన్నారు.
ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు: ఆర్డీఓ
మాగనూర్: మండల కేంద్రం సమీపంలోని పెద్దవాగు వద్ద ఉన్న ఇసుక రీచ్‌ను నారాయణపేట ఆర్డీఓ రాంచందర్ మంగళవారం ఉదయం సందర్శించారు. మాగనూర్ గ్రామానికి చెందిన వ్యక్తులు నూతనంగా టీజీఎండీసీ రీచ్ కోసం దరఖాస్తు పెట్టుకోగా.. వారి పట్టా భూములతో పాటు ఇసుకను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి పట్టా భూములో ఇసుక ఉన్నట్‌లైతే టీజీఎండీసీ అనుమతుల ద్వారా ఇసుకను తరలించడానికి అవకాశం కల్పిస్తామన్నారు. జిల్లాలో జరుగుతున్న గృహ, వ్యాపార నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ అనుమతులతో నడుస్తున్న రాఘవ కన్‌స్ట్రక్షన్స్ రీచ్‌ను పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక తరలించుకోవాలని ఆదేశించారు. మండలంలో ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారులకు తెలియజేయాలని కోరారు. అక్రమంగా ఇసుక తరలించే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్ సురేష్‌కుమార్, ఆర్‌ఐ శ్రీశైలం, రైతులు తదితరులు ఉన్నారు.
నూతన బస్సు సర్వీసులు ప్రారంభం
కోస్గి రూరల్: ప్రజల సౌకర్యార్థం నూతనంగా మూడు రూట్లలో బస్సు సర్వీసులను ప్రారంభించామని, ఈ బస్సులను సద్వినియోగం కడా చైర్మన్ వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం కోస్గి బస్‌స్టేషన్‌లో డిపో మేనేజర్ లావణ్య పూజలు చేసి బస్సులను ప్రారంభించారు. కోస్గి నుంచి భూనీడ్ మీదుగా నారాయణపేట్, కోస్గి నుంచి వత్తుగుండ్ల మీదుగా నారాయణపేట్, కోస్గి నుంచి పోలెపల్లి మీదుగా మెహిదిపట్నం వరకు సర్వీసులను నడుపనున్నట్లు తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు వేస్తున్నామని, ప్రజల సౌకర్యార్థం నూతన మార్గాలలో బస్సులు నడుపుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ భీములు, మండల పార్టీ అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ బీంరెడ్డి, కృష్ణమూర్తి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములుపర్యవేక్షించాలి


