ప్రతి జిన్నింగ్‌ మిల్లులో సీసీఐ కేంద్రాల ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

ప్రతి జిన్నింగ్‌ మిల్లులో సీసీఐ కేంద్రాల ఏర్పాటు

Nov 5 2025 9:08 AM | Updated on Nov 5 2025 9:08 AM

ప్రతి జిన్నింగ్‌ మిల్లులో సీసీఐ కేంద్రాల ఏర్పాటు

ప్రతి జిన్నింగ్‌ మిల్లులో సీసీఐ కేంద్రాల ఏర్పాటు

నారాయణపేట: జిల్లాలోని అన్ని జిన్నింగ్‌ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను సూచించారు. తెలంగాణ కాటన్‌ జిన్నింగ్‌ మిల్లుల సంఘం ఈ నెల 6న మార్కెట్‌ యార్డులో మిల్లులు, ప్రైవేట్‌ కొనుగోళ్లను మూసివేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో జిల్లాలోని జిన్నింగ్‌ మిల్లుల యజమానులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో 7 జిన్నింగ్‌ మిల్లులు ఉన్నాయని, వాటిలో ఇప్పటి వరకు 5 మిల్లుల్లోనే సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయని, పత్తి రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మిగతా రెండింటిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పత్తిని కొనుగోలు చేయాలని సీసీఐ సంస్థ ప్రతినిధులను కోరారు. దీనిపై స్పందించిన సీసీఐ జిల్లా ప్రతినిధులు తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామని, తప్పనిసరిగా మిగతా రెండు మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఎకరాకు 12 క్వింటాళ్లు..

జిల్లా వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి వస్తుందని, కపాస్‌ కిసాన్‌ యాప్‌లో మొన్నటి వరకు 12 క్వింటాళ్ల లెక్కనే చూపించిందని, కానీ తాజాగా కేవలం 7 క్వింటాళ్లే చూపిస్తుండడంతో రైతులకు సమస్యగా మారిందని మిల్లర్లు అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. కొనుగోళ్లలో స్లాట్‌ బుకింగ్‌ పద్ధతిని ఎత్తివేయాలని మిల్లర్లు కోరారు. స్పందించిన రెవెన్యూ కలెక్టర్‌ అది కేంద్రం పరిధిలోని వ్యవహారమని ఏమీ చేయలేమని, కానీ ఈ సీజన్‌లో కపాస్‌ కిసాన్‌ మొబైల్‌ యాప్‌, స్లాట్‌పై జిల్లా రైతులకు అవగాహన కల్పిస్తే, వచ్చే సీజన్‌లో రైతులకు స్లాట్‌ బుకింగ్‌ ఇంకా సులువు అవుతుందన్నారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్‌ శ్రీరామ్‌ ప్రణీత్‌, మార్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డి, డీఏఓ సుధాకర్‌, సీపీఓ యోగానంద్‌, డీఎంఓ బాలమణి, అగ్నిమాపక శాఖ అధికారి సురేష్‌రెడ్డి, ఎస్‌ఐ గాయత్రి, సీసీఐ ప్రతినిధులు అనూప్‌మిశ్రా, శ్రీనివాస్‌రావు, మార్కెట్‌ కార్యదర్శి భారతి, సూపర్‌వైజర్‌ లక్ష్మణ్‌, మిల్లర్లు శ్రీనివాస్‌, పవన్‌ లాహోటీ, తమన్నా, రాహుల్‌ జై, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement