7 నుంచి యువజనోత్సవాలు
● యవతకు జిల్లా స్థాయి పోటీలు
● 15 నుంచి 29 ఏళ్ల వయసు వారు అర్హులు
● 7 అంశాల్లో పోటీల నిర్వహణ
నర్వ: యువతలో దాగి ఉన్న నైపుణ్యాలు వెలికి తీసేందుకు ప్రభుత్వం యువజన సంబరాలకు శ్రీకారం చుట్టింది. చదువుతో పాటు కళలను వెలితీకేందుకు యువతకు చక్కని వేదికగా మారబోతుంది. ఈ నెల 7 నుంచి జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్ గార్డెన్, ఓల్డ్ ఆస్పత్రి ఆవరణలో యువజనోత్సవాల్లో భాగంగా క్రీడా, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించనున్నారు.
నిర్వహించే అంశాలు..
జానపద నృత్యం (లైవ్ మ్యూజిక్), జానపద పాటలు, కవిత్వం (హిందీ, ఆంగ్లం, తెలుగు), వ్యాసరచన పోటీ (తెలుగు, హిందీ, ఆంగ్లం), పెయింటింగ్, ఉపన్యాసం (తెలుగు, ఆంగ్లం, హిందీ), ఇన్నోవేషన్ ట్రాక్ (ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా) అంశాల్లో పోటీలు ఉంటాయి. విజేతలను హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి యువజనోత్సవాలకు ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రథమ స్థానంలో నిలిచిన వారు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 12 వరకు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు.
అర్హతలు: ● జిల్లాకు చెందిన యువత 15 నుంచి 29 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారు మాత్రమే అర్హులు. మూడేళ్లుగా జాతీయస్థాయి యువజనోత్సవాల్లో పాల్గొన్న వారు అనర్హులు పరిగణించబడతారు.
● పోటీల్లో పాల్గొనే యువత ఎవరి సామగ్రి వారే తెచ్చుకోవాలి. జానపద గీతాలు ఆలపించే బృందంలో 10 మంది మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది.
● కవిత్వం 9 నిమిషాల్లో వెయ్యి పదాలతో గంట సమయంలో పూర్తి చేయాలి. పెయింటింగ్స్ ఏ2 సైజు పేపరులో 90 నిమిషాల్లో, చిత్రలేఖనానికి సంబంధించి శీర్షిక 20 నుంచి 30 పదాలు మించకూడదు. పెయింటింగ్ సామగ్రి అభ్యర్థులే తెచ్చుకోవాలి.
● ఆసక్తి గల వారు జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రెండు కలర్ ఫొటోలు, ఆధార్‌కార్డు లేదా పుట్టిన తేదీ తెలిపే ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు జిల్లాకేంద్రంలోని యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో సంప్రదించాలి.
7 నుంచి యువజనోత్సవాలు


