సృజనాత్మకతను పెంపొందించుకోవాలి
కోస్గి రూరల్: సాంకేతిక ఆధారిత సృజనాత్మకతను పెంపొందించేందుకు తెలంగాణ రాష్ట్ర నేషనల్ గ్రీన్ కార్డ్స్ ఆధ్వర్యంలో చేపట్టిన హరితాన్ ఈకో హ్యకతాన్‌పై జిల్లా స్థాయి పోటీలను ఘనంగా చేపట్టామని ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్, సమన్వయకర్త శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ–వేస్ట్ సేకరణ, పునర్వినియోగం, పర్యావరణ హితంగా నిర్వహణపై కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని ఇంజినీరింగ్, వివిధ డిగ్రీ కళాశాలకు చెందిన 66 మంది విద్యార్థులు పోటీలకు హాజరయ్యారు. వీరు మొబైల్ యాప్ ఆధారిత వ్యర్థ నిర్వహణ, కృత్రిమ మేధస్సు, సర్క్యూలర్ ఆఫ్ ఎకానమీ పాత్ర, ఏఐ ఆధారంగా ఈ–వేస్ట్ వర్గీకరణ అంశాలపై ప్రదర్శనలు చేపట్టారు. ఇందులో మొదటి బహుమతి క్రాంతి బృందం, ద్వితీయ స్థానంలో మేఘన బృందం, తృతీయ స్థానంలో భవానీ బృందం దక్కించుకోగా.. వారికి ప్రశంసాపత్రాలను అందించారు. కార్యక్రమంలో హెచ్‌ఓడీలు వెంకట్‌రెడ్డి, ఆనంద్‌కుమార్, సంపత్, విట్టల్‌ప్రసాద్, వెంకటాద్రి, రజనికుమారి తదితరులు ఉన్నారు.


