రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పంచాయతీ ఎన్నికలో మరీ బరితెగించారు. తన సతీమణి ఇందిర ఏకగ్రీవం కోసం ఎలక్షన్ కమిషన్, పోలీసులను పక్కదోవ పట్టించారు. బనగానపల్లె మేజర్ పంచాయతీకి టీడీపీ మద్దతుదారురాలిగా బీసీ ఇందిర నామినేషన్ వేశారు. ఎలాగైనా సరే ఏ పార్టీ మద్దతుదారుడి నుంచి నామినేషన్‌లు వేయకూడదని పోలీసులకు హుకుం జారీ చేశారు. మంత్రి పదవి, తమ అనుచరుడికి జెడ్పీ చైర్మన్, పలువురికి పార్టీలో పదవులు ఇప్పించుకున్న ఆయన చివరికి సర్పంచ్ పదవి కూడా తీసుకోవడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆఖరుకు ఈ పంచాయతీ పదవికి కూడా దిగజారాలా అని పలు పార్టీల నాయకులు, రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
సాక్షి, నంద్యాల: పంచాయతీ ఎన్నికలను టీడీపీ నేతలు రక్తసిక్తం చేస్తున్నారు. నానా బీభత్సం చేస్తూ ప్రజలను భయపెడుతున్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లపై దాడులు చేశారు. పోలింగ్ కేంద్రాల నుంచి వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఏజెంట్లను బయటకు లాగేశారు. ఇష్టానుసారంగా రిగ్గింగ్ చేశారు. ఇదే సంప్రదాయాన్ని ఆదివారం జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో కొనసాగించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు అండతో తొలి విడత కొన్ని చోట్ల ప్రజలు ధైర్యంగా ఓట్లు వేశారు. రెండో విడత ఎన్నికల్లోనూ ఉత్సాహం ఉరిమేలా ఓటువేసేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు.
11 మండలాల్లో ఎన్నికలు
రెండో విడత పోరులో బనగానపల్లె, అవుకు, కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, సంజామల, పాణ్యం, గడివేముల ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది మండలాలు ఉన్నాయి. ఈ 11 మండలాల్లో 195 పంచాయతీలు, 1982 వార్డులు ఉన్నాయి. అధికారులు 2108 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఉపసంహరణ, తుది జాబితా ప్రకారం 72 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవాలు అయ్యాయి. ఇందులో అత్యధికంగా అవుకులో 17 స్థానాల్లో ఏకగ్రీవాలు అయ్యాయి. మొత్తం 123 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్ స్థానాలకు 354 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 1,153 వార్డులకుగాను 2,419 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు 311, అతి సమస్యాత్మక ప్రాంతాలు 134 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 123 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,108 పోలింగ్ గదులను సిద్ధం చేశారు. ఓటు హక్కును 4,77,460 మంది ఓటర్లు వినియోగించుకోనున్నారు.
బరితెగిస్తున్న ‘పచ్చ’నేతలు
శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపెంటలో మొట్టమొదటి సారిగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తలపెట్టింది. కానీ ఇది నచ్చని చంద్రబాబు ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అడ్డమైన జీవోలు తీసుకువచ్చి అడ్డుకున్నారు. అయితే మరలా పంచాయతీ ఎన్నికల పేరుతో డ్రామాలాడారు. ఎన్నికలు నిర్వహిస్తున్నామని ప్రకటించారు. కానీ ఇక్కడ ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలవడం ఖాయమనుకొని కుట్రపన్నారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను నామినేషన్లు వేయకుండా పోలీసులతో అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని రెండుసార్లు అటకాయించారు. ఆత్మకూరు డీఎస్పీ తన సిబ్బందితో బెదిరించి నామినేషన్లు వేయకుండా చేశారు. ఫలితంగా దొడ్డిదారిన సున్నిపెంట పంచాయతీని ఏకగ్రీవం చేసుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఏకగ్రీవం చేసుకోవడంపై సున్నిపెంట ప్రజలు, ఓటర్లు, పలు ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


