రానున్న ఐదు రోజులు వర్షాలు లేనట్లే ! | - | Sakshi
Sakshi News home page

రానున్న ఐదు రోజులు వర్షాలు లేనట్లే !

Nov 29 2026 2:41 PM | Updated on Nov 29 2026 2:41 PM

కర్నూలు(అగ్రికల్చర్‌): బంగాళాఖాతంలో తరచూ అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. కానీ జిల్లాపై వీటి ప్రభావం ఏ మాత్రం కనిపించడం లేదు. రానున్న ఐదు రోజులు ఉమ్మడి జిల్లాలో వర్షాలు లేనట్లేనని వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇటీవల బంగాళాఖాతంలో అర్నబ్‌, మురసు, ఆక్వాన్‌ తుపానులు జిల్లాపై ఎలాంటి ప్రభావం చూపలేదు. తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పటికీ జిల్లాకు మాత్రం వర్షసూచన లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. అక్టోబర్‌ నెల సాధారణ వర్షపాతం 109.9 మిమీ ఉండగా 20 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. నవంబర్‌ నెల సాధారణ వర్షపాతం 29 మిమీ ఉండగా 4.8 మిమీ వర్షం మాత్రమే కురిసింది. అక్టోబరు 1 నుంచి రబీ సీజన్‌ మొదలైంది. సాధారణ సాగు 1,14,337 హెక్టార్లు ఉండగా.. ఇప్పటి వరకు 44,370 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. చినుకు జాడలేక పంటల సాగు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. సాగులోని పప్పుశనగ, జొన్న, టమాట, మినుము తదితర పంటలు ఎండిపోతున్నాయి.

3 నుంచి బాలలకు టీడీ వ్యాక్సినేషన్‌

కర్నూలు(హాస్పిటల్‌): టెటానస్‌, డిప్తీరియా(టీ.డీ) వ్యాక్సినేషన్‌ను డిసెంబర్‌ 3 నుంచి 5వ తేది వరకు నిర్వహించనున్నట్లు డిస్ట్రిక్ట్‌ ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ ఉమ తెలిపారు. 10, 16 సంవత్సరాల వయస్సు నిండిన బాలబాలికలకు ఈ వ్యాక్సిన్‌ వేస్తామన్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. హైస్కూళ్లు, కళాశాలల్లో చదువుతున్న వారికి వారు చదువుతున్న విద్యాసంస్థల్లో, బడి బయట ఉన్న వారికి సమీప అంగన్‌వాడీ కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

ప్రశాంతంగా నవోదయ

6వ తరగతి ప్రవేశ పరీక్ష

ఎమ్మిగనూరు రూరల్‌: మండల పరిధిలోని బనవాసి జవహర్‌ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశానికి శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ ఇ.పద్మావతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6వ తరగతిలో ప్రవేశానికి 6,970 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు 5,379 మంది హాజరయ్యారన్నారు. పరీక్ష ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించామన్నారు.

డీఎస్సీ అభ్యర్థులకు

ఆన్‌లైన్‌ శిక్షణ

కర్నూలు(అర్బన్‌): జిల్లాలో డీఎస్సీకి సంసిద్ధులయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ శిక్షణను అందిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి, స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ కె.ప్రసూన తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ డీఎస్సీ(ఎస్‌జీటీ/స్కూల్‌ అసిస్టెంట్‌) పోస్టులకు ఆన్‌లైన్‌ శిక్షణకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను బీసీ స్టడీ సర్కిల్‌కు స్వయంగా వచ్చి అందించాలన్నారు. డిసెంబర్‌ మొదటి వారం నుంచి ఆన్‌లైన్‌ శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు 08518–236076 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement