పాండిచ్చేరిలో దాచి.. ఓటింగ్‌కు దూరం చేసి! | - | Sakshi
Sakshi News home page

పాండిచ్చేరిలో దాచి.. ఓటింగ్‌కు దూరం చేసి!

Nov 29 2026 2:41 PM | Updated on Nov 29 2026 2:41 PM

పాండిచ్చేరిలో దాచి.. ఓటింగ్‌కు దూరం చేసి!

● తిరిగొచ్చిన 32వ వార్డు కౌన్సిలర్‌ రోజమ్మ

● వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో

టీడీపీ నేతల కుట్రలు బట్టబయలు

నంద్యాల(అర్బన్‌): మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో టీడీపీ నేతల కుట్రలు బట్టబయలయ్యాయి. నంద్యాల పట్టణంలో 52 వార్డులు ఉండగా వైఎస్సార్‌సీపీ 27, టీడీపీ 24, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించాయి. వైఎస్సార్‌సీపీకి ఎమ్మెల్సీ ఓటుతో కలిపి 28 సంఖ్యా బలం ఉంది. కూటమి పార్టీకి సంబంధించి 25 వార్డు మెంబర్‌ స్థానాలతో పాటు ఎమ్మెల్యే, ఎంపీతో పాటు, మున్సిపల్‌ చైర్మన్‌ ఓటుతో కలిపి మొత్తం 28 మందితో సంఖ్యా బలం ఉంది. ఇరువురికి సమాన సంఖ్యా బలం ఉండటంతో వైస్‌ చైర్మన్‌ పదవి ఏపార్టీని వరిస్తుందోనని పుర ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూశారు. ఈ సమయంలో ఈ నెల 9న జరగాల్సిన వైస్‌ చైర్మన్‌ ఎన్నికను 23వ తేదీకి వాయిదా వేశారు. ఇది సరిపోదన్నట్లు 32వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ మహిళా కౌన్సిలర్‌ ఎద్దు రోజమ్మను ప్రలోభాలకు గురిచేశారు. ఇందుకు ఓ న్యాయవాది, ఇద్దరు టీడీపీ నాయకులు మధ్యవర్తిత్వం వహించారు. రూ.35 లక్షల ఒప్పందంతో పాటు వైస్‌ చైర్మన్‌ ఎన్నిక పూర్తయ్యేంత వరకు పాండిచ్చేరికి వెళ్లేందుకు దావ ఖర్చుల కింద రూ.1.50 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. ఈ నెల 23న ఓటింగ్‌కు రోజమ్మ దూరం కావడంతో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవి టీడీపీ వశమైంది.

తిరిగొచ్చిన రోజమ్మ...అందని మొత్తం!

అప్పట్లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇతర ప్రాంతాలకు వెళ్లిన కౌన్సిలర్‌ రోజమ్మ రెండు రోజుల క్రితం నంద్యాలకు చేరుకున్నారు. తనకు ఇస్తామని చెప్పిన మొత్తాన్ని ఎప్పుడిస్తారంటూ 13వ వార్డు కౌన్సిలర్‌ను అడిగినట్లు సమాచారం. అయితే తాను వైస్‌ చైర్మన్‌ కుర్చీలో కూర్చోలేదని, ఆ మొత్తం తానిచ్చేందుకు సిద్ధంగా లేనని చెప్పినట్లు తెలుస్తోంది. వైస్‌ చైర్మన్‌ సీట్‌లో బీసీ కౌన్సిలర్‌ను కూర్చోబెట్టారని, వారి వద్దకు వెళ్లి అడగాలంటూ సూచించినట్లు సమాచారం. దీంతో ఖంగుతిన్న రోజమ్మ .. గతంలో చెప్పిన విధంగా ఒప్పందం మొత్తాన్ని ఇవ్వాలని కోరినా ప్రయోజనం లేకుండా పోయినట్లు సమాచారం. రోజమ్మ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అయిందంటూ పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.

వెన్నుపోటుపై ప్రజాగ్రహం

నంద్యాల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో వెన్నుపోటు వ్యవహారం ప్రజాగ్రహంగా మారింది. కౌన్సిలర్‌ ఎద్దు రోజమ్మ తీరుపై స్థానిక ప్రజలు, వైఎస్సార్‌సీపీ భగ్గుమన్నాయి. శనివారం రాత్రి రోజమ్మ ఇంటి వద్ద భారీ ధర్నా నిర్వహించి నమ్మకద్రోహి రోజమ్మ డౌన్‌..డౌన్‌.. తక్షణమే రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు మనోజ్‌కుమార్‌, కారురవికుమార్‌ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీకి రావాల్సిన వైస్‌ చైర్మన్‌ పదవి రోజమ్మ గైర్హాజరుతో ఆ పదవి టీడీపీ ఖాతాలోకి వెళ్లిందన్నారు. నైతికత ఉంటే తక్షణమే పదవికి రాజీనామా చేసి మళ్లి ఎన్నికలకు రావాలన్నారు. నిరసన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు దేవనగర్‌ బాష, మేకల శేఖర్‌, ప్రవీణ్‌, కన్న, కిరణ్‌ కుమార్‌, డెన్నీలతో పాటు పెద్ద సంఖ్యలో వార్డు మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement