● నందివర్గం పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత
● మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
రంగప్రవేశంతో అభ్యర్థి విడుదల
బనగానపల్లె: వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు, చెరువుపల్లె గ్రామ సర్పంచ్ అభ్యర్థి అయిన ఇటిక్యాల చిన్నపుల్లయ్యను శనివారం ఉదయం నందివర్గం పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. ఆదివారం పోలింగ్ ఉండగా ఎన్నికల పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థిని తీసుకెళ్లడంపై గ్రామస్తులు ఆందోళనతో భారీ సంఖ్యలో నందివర్గం పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. ఇటిక్యాల చిన్నపుల్లయ్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి కూటమి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు
విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హుటాహుటిన బనగానపల్లె నుంచి నందివర్గం పోలీసుస్టేషన్‌కు బయల్దేరారు. దీంతో బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్‌రెడ్డి, ఎస్‌ఐ భూపాలుడు పోలీసు బందోబస్తుతో నందవరం గ్రామం వద్ద మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. సర్పంచ్ అభ్యర్థి ఎక్కడ ఉంచారని పోలీసులను కాటసాని ప్రశ్నించారు. సర్పంచ్ అభ్యర్థిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన పోలీసులు తమ ఆధీనంలో ఉన్న సర్పంచ్ అభ్యర్థి చిన్నపుల్లయ్యను నందవరం తీసుకువచ్చి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి అప్పగించారు.
మంత్రి అండతోనే దౌర్జన్యాలు
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అండతోనే టీడీపీ నాయకులు దౌర్జన్యాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. నందవరం గ్రామం వద్ద సర్పంచ్ అభ్యర్థి పుల్లయ్యతో కలిసి విలేకరుల సమావేశంలో కాటసాని మాట్లాడారు. చెరువుపల్లె గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఇటిక్యాల పుల్లయ్య నామినేషన్ వేసినప్పటి నుంచి ఉపసంహరణ కోసం పోలీసులతో టీడీపీ నాయకులు వేఽఽధింపులకు గురిచేయించారన్నారు. గ్రామంలో చిన్నపుల్లయ్యకు ప్రజాదరణ ఎక్కువగా ఉందని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడ్డారన్నారు. ఓటమి భయంతోనే చిన్నపుల్లయ్యను పోలీసులు తీసుకెళ్లారన్నారు.


