ఆళ్లగడ్డ: టీడీపీకి వత్తాసు పలుకుతూ పోలీసుల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తుండటంతో పల్లెల్లో విధ్వంసాలు, రక్తపాతాలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. ఆళ్లగడ్డలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, పోలీసుల వ్యవహారశైలిని ఎండగట్టారు.
ఎమ్మెల్యే స్వయంగా
రిగ్గింగుకు పాల్పడటమా?
గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ రోజు ఎమ్మెల్యే స్వయంగా రిగ్గింగుకు పాల్పడటం ఏంటని ప్రశ్నించారు. కోటకందుకూరులో ఎమ్మెల్యే అఖిలప్రియ రిగ్గింగు చేయిస్తున్నారని డీఎస్పీకి ఫోన్ చేసి చెప్పినా అడ్డుకోలేక పోయారన్నారు. అక్కడకు వెళ్లకుండా ముందుగానే అడ్డుకుని ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండేదా అని నిలదీశారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి అక్కడ కూర్చోబెట్టుకుని టీడీపీ వారిని రిగ్గింగు చేసుకోండని అనుమతి ఇచ్చినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. మాయలూరులో రిగ్గింగు చేసుకునేందుకు వెళితే అక్కడి మహిళలు తిరగబడితే విఖ్యాత్‌రెడ్డి పారిపోయాడన్నారు. అహోబిలంలో కూడా ఎమ్మెల్యే పోలింగ్ బూత్‌లోకి వెళ్లి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు ఈడ్చిపడేసి రిగ్గింగు చేయిస్తుంటే వారు తిరగబడి ధర్నా చేశారన్నారు. ధర్నాలో ఉన్న మహిళలను కారుతో తొక్కించి హత్య చేయాలని చూస్తారా అని నిలదీశారు. అసలు అహోబిలానికి ఎమ్మెల్యే ఎందుకు వెళ్లారో ముందు చెప్పాలన్నారు. రౌడీషీట్ ఉందని వైఎస్సార్సీపీ నాయకుడు సీసా వెంకటేశ్వర్లును హౌస్ అరెస్ట్ చేశారని, అయితే టీడీపీ నాయకుడు సంజీవరాయుడుపై పీడీయాక్ట్ ఉన్నా ఎందుకు పోలీంగ్ బూత్‌లో ఉంచారో చెప్పాలన్నారు.
రిగ్గింగుకు డీఎస్పీనే అనుమతి ఇచ్చారా?
ఎక్కడైనా రిగ్గింగులు జరిగితే పోలీసులే అడ్డుకుంటారని, అయితే జి.జమ్ములదిన్నెలో అందుకు విరుద్ధంగా జరిగిందన్నారు. ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్ స్వయంగా వైఎస్సార్సీపీ వారిని బయటకు పంపించి టీడీపీ వారిని లోపలకు పంపి రిగ్గింగుకు అనుమతి ఇచ్చారని గంగుల బిజేంద్రారెడ్డి ఆరోపించారు. కేవలం డీఎస్పీ వల్లే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇన్ని గొడవలు, దౌర్జన్యాలు జరిగాయన్నారు. కుమారుడిపై దాడి చేస్తుంటే తట్టుకోలేక వెళితే బైరి నాగలక్ష్మీ పైనా టీడీపీ గూండాలు దాడి చేశారన్నారు. ఆసుపత్రిలో ఆమె మృతి చెందితే కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండా గొడవలకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు ఎలా అంటారని ప్రశ్నించారు. గొడవలో గాయపడ్డ వారిలో ఆమె ఉన్నారని రాత పూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు పత్రం ఉంది కదా.. వాస్తవాలను కప్పిపుచ్చేందుకు యత్నించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడు రోజులైనా ఎఫ్‌ఐఆర్ ఏదీ?
ఇంతటి విధ్వసంకర ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా ఇంతవరకు కనీసం ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని గంగుల ప్రశ్నించారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టీడీపీ గూండాల దాడితోనే
మహిళ మృతి
ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్ ఎందుకు
నమోదు చేయలేదు?
ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే
గంగుల బిజేంద్రారెడ్డి


