● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. రెండో విడతలో 11 మండలాల పరిధిలోని 123 పంచాయతీలు, 1,982 వార్డులకు ఆదివారం పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం 123 పోలింగ్ కేంద్రాల లొకేషన్ల పరిధిలో 2,108 గదులను సిద్ధం చేసినట్లు తెలిపారు. రెండో విడత ఎన్నికలు జరగనున్న 11 మండలాల్లో మొత్తం 195 పంచాయతీలు ఉండగా ఇప్పటికే 72 ఏకగ్రీవమయ్యాయన్నారు. మొత్తం 123 పంచాయతీల్లో పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంటుందని పేర్కొన్నారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు, నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.


