● ఒకరు మృతి..100 మందికి పైగా
గాయాలు
● మెరుగైన చికిత్స కోసం ఆలూరు,
ఆదోనికు తరలింపు
హొళగుంద: బన్ని ఉత్సవంలో ఆది నుంచి వస్తున్న ఆచారమే నడిచింది. పోలీస్ నిబంధనలు, అధికారుల ఆదేశాలను పట్టించుకోలేదు. విజయదశమిని పురస్కరించుకుని హొళగుంద మండలం దేవరగట్టులో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు కర్రల సమరం సాగింది. ఆలూరు పట్టణం ఇందిరానగర్‌కు చెందిన పోత రాజు(32) అనే వ్యక్తి మృతి చెందాడు. మొత్తం 100 మందికి పైగా గాయపడగా చికిత్స కోసం ఆదోని, ఆలూరు, కర్నూలుకు తరలించారు. తీవ్రంగా 25 మంది గాయపడగా.. మలకన్న, శరబన్న, పరుశురామ్, గణేష్, రామాంజనేయులు నాయుడు తదితరల పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఆలూరు, ఆదోనికి 108, 104 అంబులెన్స్‌లో తరలించారు.
లక్షన్నరకు పైగా భక్తులు
బుధవారం అర్ధరాత్రి ప్రారంభమైన మాళ మల్లేశ్వరస్వామి జైత్రయాత్ర గురువారం ఉదయం వరకు సాగింది. నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులతో పాటు దేవరగట్టు చుట్టు పక్కల గ్రామాలైన నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెరతాండా, కురుకుంద, సమ్మతగేరి, పెద్దహ్యాట, హెబ్బటం, లింగంపల్లితో పాటు దాదాపు 15 గ్రామాలకు చెందిన భక్తులు ఉత్సవంలో పాల్గొని మొగలాయి ఆడారు. బన్ని ఉత్సవాన్ని తిలకించేందుకు కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణ నుంచి లక్షన్నరకు పైగా భక్తులు తరలి వచ్చారు.
పటిష్ట బందోబస్తు ఉన్నా..
ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ఆదోని ఏఎస్పీ జయశర్మ పర్యవేక్షణలో ఆదోని, నంద్యాల, కర్నూలు, డోన్, తదితర ప్రాంతాలకు చెందిన డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో పాటు ప్రత్యేక బలగాలు వచ్చాయి. మహిళా పోలీసులు, స్పెషల్ పార్టీలతో కలిసి మొత్తం కలిసి వెయ్యి మందితో పటిష్ట బందోబస్తు ఉన్నా కర్రల సమరం ఆగలేదు. వందల సంఖ్యలో సీసీ కెమెరాలు, ఐదు డ్రోన్ కెమరాలు, దాదాపు 800 వరకు భారీ వెలుతురు ఇచ్చే లైట్లను ఏర్పాటు చేసి పోలీస్ కంట్రోల్ రూం ద్వార ఎప్పటికప్పుడు పరిస్థితి ని సమీక్షించినా దేవరగట్టు రక్తమోడింది.
నేడు రథోత్సవం
దేవరగట్టులో శుక్రవారం సాయంత్రం మాళ మల్లేశ్వరస్వామి రథోత్సవం ఘనంగా జరగనుంది. శనివారం గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన ఉంటాయి. ఆదివారం మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి.
బన్ని ఉత్సవం సాగింది ఇలా..
బసవన్నగుడి సమీపంలో తిష్టవేసిన
అరికెరకు చెందిన భక్తులు
అలజడి సృష్టించారు.
విగ్రహాలు, పల్లకీని పాదాల గట్టు వైపు వెళ్లిన
సమయంలో అగ్గి కాగడాలు, రాళ్లు విసిరారు.
రింగు కర్రలు, దివిటీలతో దాడి చేయడంతో
చాలా మందికి గాయాలయ్యాయి.
అరికెర, ఇతర గ్రామాల భక్తుల మధ్య గంట
పాటు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
విగ్రహాలు, పల్లకీ రాక్షసపడి గుండ నుంచి
శమీవృక్షం వద్దకు తీసుకెళ్లారు.
శమీవృక్షం మీదుగా ఎదురు బసవన్న గుడి
వైపునకు వెళ్లారు.
ఆలయ పూజారి గిరిస్వామి భవిష్యవాణి
(కార్ణీకం) వినిపించిన అనంతరం
ఉత్సవమూర్తులను మల్లప్ప గుడిలోని
సింహాసన కట్టమీద అధిష్టింపజేశారు.
భక్తులు చప్పట్లు కొట్టి ఇళ్లకు
తిరుగు ప్రయాణమయ్యారు.


