శ్రీశైలం: సున్నిపెంట – శ్రీశైలం ఘాట్ మార్గంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. రహదారిలో మలుపు వద్ద భారీ వృక్షం విరిగి రోడ్డుపై పడింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బందితో అక్కడికి చేరుకుని చెట్టును తొలగించే వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా చేశారు. ఘాటు మార్గంలో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ వారు వాహన చోదకులకు సూచించారు.
కర్నూలు(సెంట్రల్): తాను ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కర్నూలు, డోన్, నంద్యాల ప్రాంతాల్లో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కాంట్రాక్టర్ హనుమదాసు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తాను రూ.3 కోట్లతో ఆయా ప్రాంతాల్లో రోడ్లు, మంచినీటి పనులకు సంబంధించిన పనులు చేశానని, అయితే ఇంత వరకు ఒక్క రూపాయి బిల్లు చెల్లించలేదన్నారు. అప్పుల తెచ్చి పనులు చేయించానని, ప్రభుత్వం చెల్లించకపోవడంతో వడ్డీలు పెరిగి అప్పులపాలయ్యాయని, వెంటనే చెల్లించకపోతే ఇబ్బందికరంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తహసీల్దార్
కార్యాలయంలో పాము
కల్లూరు: స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సోమవారం పాము కలకలం రేపింది. కార్యాలయంలో పని చేసి సిబ్బంది బైక్‌లోకి పాము దూరింది. గుర్తించిన స్థానికులు, కార్యాలయం సిబ్బంది చాలా సేపు దానిని బయటకు రప్పించడానికి ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో పాములు పట్టే వ్యక్తి వచ్చి బయటకు తీశారు. దీంతో కార్యాలయ సిబ్బంది, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
పాముకాటుతో వ్యక్తి మృతి
కొత్తపల్లి: పాముకాటుకు గురై చికిత్స పొందుతూ కోలుకోలేక ఎర్రమఠం గ్రామానికి చెందిన టేకులనాగరాజు(50)అనే వ్యక్తి మృతి చెందాడు. మొక్కజొన్న పంటనుకు నీళ్లు పెట్టేందుకు పొలానికి వెళ్లి ఫిబ్రవరి 28న ఈయన పాముకాటుకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా అక్కడ ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి టేకుల పెద్ద పుల్లయ్య ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రవీంద్రబాబు తెలిపారు.
వైద్య విద్యార్థిని మృతికి కారణాలు తేల్చండి
డోన్ రూరల్: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వర్తిస్తూ తన కుమార్తె బత్తుల దీపిక గత నెల 5న అనుమానాస్పద స్థితిలో మరణించిందని, ఇందుకు గల కారణాలను ఇప్పటివరకు వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోందని బాలిక తండ్రి, ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఆధ్యక్షుడు బత్తుల కోదండ రామిరెడ్డి వాపోయారు. సోమవారం డోన్ మండలం కొత్తబురుజు గ్రామ పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె మృతిపై అనుమానాలను నివృత్తి చేయాలని మంత్రులతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను నెల రోజుల నుంచి కోరుతున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, వైద్యాధికారులు అనేక కోణాల్లో విచారించినా సరైన కారణాలు తెలపకపోవడం తమ కుటుంబ సభ్యులను మరింత ఆందోళనకు గురి చేస్తోందన్నారు. పోస్టుమార్టం నివేదికను తక్షణమే వెవెల్లడించాలని కోరారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు సైతం వినతి పత్రం సమర్పించారు.


