మహానంది: నల్లమల అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. పట్టపగలే జేసీబీలు పెట్టి పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నా అడ్డుకునే వారు కరువయ్యారు. అధికార పార్టీకి చెందిన నేతలే కావడంతో అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మహానంది, శిరివెళ్ల మండలాల పరిధిలోని అంకిరెడ్డి చెరువు, వజ్రాల వంక వాగు పరిసరాల్లో ఎర్రమట్టి అధికంగా లభిస్తుండటంతో అక్రమార్కులు ప్రకృతి సంపదను కొల్లకొడుతున్నారు. విలువైన ఎర్రమట్టిని ఇటుకల బట్టీలకు, గ్రావెల్‌ను వెంచర్లకు తరలిస్తూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. మహానందితో పాటు సమీపంలోని పెద్దకొట్టాల, నంద్యాల పట్టణాల్లోని పలు వెంచర్లకు మట్టి, గ్రావెల్ తరలిపోతుంది. అనుమతులు లేని కొందరు రాత్రి వేళల్లో మట్టిని తరలిస్తూ కొల్లగొడుతున్నారు. ఇంటి నిర్మాణాలు, పొలాల చదును కోసం ఓ ట్రాక్టర్ మట్టిని తీసుకెళ్తే పట్టుకుని కేసులు పెట్టి జరిమానాలు విధించే రెవెన్యూ, భూగర్భ గనులశాఖ అఽధికారులకు ఇవేమి కనిపించకపోవడం పట్ల పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎర్రమట్టి, గ్రావెల్‌ను టిప్పర్ల ద్వారా తరలిస్తుండటంతో నంద్యాల – గిద్దలూరు మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. నిండుగా మట్టిని, గ్రావెల్‌ను నింపుకుని వెళ్తుడటంతో వెనుకగా వెళ్లే వారి కళ్లల్లో మట్టి కొట్టుకుని పోతుంది. గతంలో టిప్పర్ల వలన రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. దీంతో పాటు గాజులపల్లె మెట్ట వద్ద నిత్యం రద్దీ ఉంటుంది. వీటికి తోడు టిప్పర్లు వేగంగా తిరుగుతుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ అధికారులు స్పందించి మట్టి, గ్రావెల్ అక్రమ రవాణాకు చెక్ పెట్టాలని సమీప పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు
రూ. కోట్లు ఆర్జిస్తున్న అక్రమార్కులు
రోడ్లపై హడలెత్తిస్తున్న మట్టి టిప్పర్లు
చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న
అధికారులు


