కొత్తపల్లి: సప్తనదీ సంగమ ప్రాంతంలో వెలసిన ప్రాచీన సంగమేశ్వరాలయం జలాధివాసం వీడుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885 అడుగులు కాగా సోమవారం 850 అడుగులకు చేరుకుంది. దీంతో ఆలయం మండపం కిందిభాగం వరకు నీరు తగ్గింది. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రాచీన సంగమేశ్వరాలయం బయటపడనుంది.
మల్లన్న సేవలో..
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతికి దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యు లు చిట్టిబోట్ల భరద్వాజశర్మ, అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో భారతీ మహాస్వామి వారి గౌరవార్థం వేదగోష్ఠి నిర్వహించారు. తరువాత గురువందన కార్యక్రమం జరిపారు. అనంతరం మహాస్వామి వారు అనుగ్రహ భాషణం చేశారు.
13న పీఎం కిసాన్
సాయం విడుదల
కర్నూలు(అగ్రికల్చర్): పీఎం కిసాన్ 22వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 13న విడుదల చేయనుంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6వేల ప్రకారం ఆర్థిక సహాయాన్ని మూడు విడతలుగా విడుదల చేస్తోందని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. ఇప్పటికే రెండు విడతలుగా రూ.4వేలు రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల చేసిందని, మూడవ విడత సాయం ఈ నెల 13న విడుదలవుతుందన్నారు.


