శ్రీశైలంటెంపుల్: భ్రమరాంబ, మల్లన్న దర్శనానికి శ్రీశైలానికి తరలివస్తున్న భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు అన్నారు. దేవస్థాన పరిపాలన భవనంలోన సమీక్షా సమావేశ మందిరంలో ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా దేవస్థాన ఈఓ మాట్లాడుతూ.. ఉగాది మహోత్సవాల్లో ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు భక్తులందరికీ అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామన్నారు. 16వ తేదీ వరకు విడతల వారీగా మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తున్నామన్నారు. క్యూ కాంప్లెక్స్, ఆలయ విభాగాలు పరస్పరం సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా విడతల వారీగా దర్శనాలను కల్పించాలన్నారు. క్యూకాంప్లెక్స్‌లో, క్యూలైన్లలో వేచిఉన్న భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారాన్ని అందించాలని ఆదేశించారు. సిబ్బంది అందరూ నిరంతరం అప్రమత్తంగా ఉంటు విధులు నిర్వర్తించాలని అన్నారు. క్యూలైన్ల నిర్వహణలో పోలీసు శాఖ సహకారాలు పొందాలన్నారు. అటవీమార్గంలో కాలినడక వచ్చే భక్తులకు అటవీశాఖ సహకారంతో ఏర్పాట్లు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అంతరాయం లేకుండా నీటిసరఫరాకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. సోమ వారం రెండో సంవత్సరం విద్యార్థులకు మ్యాథమ్యాటిక్స్–2, వొకేషనల్–2 పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలకు 7,263 మంది విద్యార్థులకు గాను 7,112 మంది హాజరు కాగా 151 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ శంకర్‌నాయక్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 97.92 శాతం హాజరైనట్లు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారన్నారు.


