ఆళ్లగడ్డ: అహోబిల నవనారసింహ క్షేత్రాలు భక్త జనసంద్రంగా మారాయి. స్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం తరలివచ్చిన భక్తుల గోవింద నామస్మరణతో నల్లమల పులకించింది. దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను యాగశాలలో కొలువుంచి అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చారణలు, ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల మధ్య శ్రీస్వాతి, శ్రీసుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించి పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాత్రి విశేష పుష్పాలకంరణ గావించిన ఉత్సవ పల్లకీలో ఉభయ దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదుడు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.
నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఈనెల 9వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.
కల్లూరు సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్
కర్నూలు(సెంట్రల్): కల్లూరు సబ్ రిజిస్ట్రార్ ప్రవీణ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కిరణ్‌కుమార్ ఆదివారం ఉత్వర్వులు ఇచ్చారు. కల్లూరు గ్రామ సర్వే నంబర్ 645ఏ వక్ఫ్ భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయడంతో జిల్లా రిజిస్ట్రార్ బజారితో విచారణ జరిపించినట్లు చెప్పారు. ఆయన నివేదిక మేరకు ప్రవీణ్‌కుమార్‌ను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. తదుపరి పూర్తి నివేదికను కోరినట్లు ఆయన వివరించారు. జిల్లాలో ఎవరైనా రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, కల్లూరు ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఈశ్వర్‌ను నియమించినట్లు డీఐజీ తెలిపారు. సోమవారం నుంచి ఆయన బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు.
మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి
నంద్యాల(అర్బన్): మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి సాధ్యమని మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో మంత్రులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల చదువును ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. ఇంజినీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతలో చాలా మంది మహిళలే ఉన్నారని ఆయన తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు రుణాలు పంపిణీ చేశారు. అంతకుముందు మంత్రులు స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను ప్రదర్శించిన స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో సీ్త్ర శిశు సంక్షేమ అభివృద్ధి అధికారి లీలావతి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, మెప్మా పీడీ వెంకట దాసు తదితరులు పాల్గొన్నారు.


