శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం పరివార దేవాలయమైన పాలధార – పంచధార వద్ద శ్రీ శారదాంబా సహిత జగద్గురు ఆదిశంకరాచార్యుల నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆదివారం దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి చేతుల మీదుగా ఈ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ఆలయం ఎదుట నిర్వహించిన యాగశాలలో అధివాసహోమాలు, నూతన విగ్రహాలకు నేత్రోన్మీలనము, అనంతరం పూర్ణాహుతి చేపట్టిన తర్వాత ఉదయం 11 నుంచి 12.30 గంటల మధ్య ఆలయంలో విగ్రహాల ప్రతిష్టాపన చేపట్టారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, అర్చకులు, వేదపండితులు, పలువురు అధికారులు ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధుశేఖర భారతీ మహాస్వామి అనుగ్రహభాషణం చేశారు. ఆదిశంకరా చార్యులు పాలధార – పంచధార వద్ద తపస్సును ఆచరించి స్వామిఅమ్మవార్లను సేవించారన్నారు. ఆయన శివానందలహరి స్తోత్రాన్ని ఇక్కడే రచించారన్నారు. శ్రీశైలక్షేత్ర మహిమావిశేషాలు, దక్షిణామూర్తితత్త్వం, అద్వైతతత్త్వం, శివానందలహరి స్తోత్ర గొప్పతనం మొదలైన అంశాలను ఆయన భక్తులకు వివరించారు.


