మహానంది: గాజులపల్లె సమీపంలోని అంకిరెడ్డి చెరువులో ఎర్రమట్టి తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ ఎర్రమట్టికి నంద్యాల జిల్లాలో విపరీతమైన డిమాండ్ ఉంది. దీనిపై టీడీపీ నేతల కన్ను పడింది. ఉదయం వేళల్లో మట్టిని తరలిస్తే అడ్డుకుంటారనుకున్నారో ఏమో కానీ రాత్రి వేళల్లో మట్టిని తరలించడం చర్చనీయాంశమైంది. శుక్రవారం రాత్రి స్థానిక అంకిరెడ్డి చెరువులో ఒక జేసీబీతో పాటు సుమారు 16 టిప్పర్లు ఉన్నట్లు గాజులపల్లె గ్రామస్తులు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో ఎర్రమట్టిని తరలిస్తున్న వైనంపై గ్రామస్తులు కొందరు మహానంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా అనుమతులు ఉంటే అధికారికంగా ఉదయం వేళల్లో తరలించొచ్చు కదా అంటూ గాజులపల్లె గ్రామస్తులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఎర్రమట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి చెరువును కాపాడాలని గాజులపల్లె, బసవాపురం గ్రామాల ప్రజలు, రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇంటర్ పరీక్షలకు 242 మంది గైర్హాజరు
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 242 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ శంకర్‌నాయక్ తెలిపారు. జువాలజీ–2, ఎకనామిక్స్–2, వొకేషనల్–2 పరీక్షలకు 96.87 శాతం హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్‌స్క్వాడ్ సిబ్బంది పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు.
శ్రీశైలం నుంచి 27,094 క్యూసెక్కుల నీటి విడుదల
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 27,094 క్యూసెక్కుల నీరు విడుదలయ్యింది. విద్యుత్ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 20,140 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 800 క్యూసెక్కులు, మల్యాల ఎత్తిపోతలకు 335 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,678 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని వదిలారు. కుడిగట్టు కేంద్రంలో 6.526 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో 3.743 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు.
గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి 8న ప్రవేశ పరీక్ష
కర్నూలు(అర్బన్)/నంద్యాల(న్యూటౌన్): అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 8న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ఎంఈ గీత శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 9వ తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్‌మెంట్ –2 పరీక్షలు నిర్వహించబడుతున్న నేపథ్యంలో ఈ నెల 2వ తేదీన నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్షను 8వ తేదీకి మార్పు చేస్తామని తెలిపారు. విద్యార్థుల ప్రయోజనం కోసమే ఈ మార్పును చేశామని, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరు కొత్త తేదీన నిర్వహించే పరీక్షకు హాజరు కావాలన్నారు.
ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్‌కు జైలు
మంత్రాలయం రూరల్: మద్యం తాగి బస్సు నడిపిన వ్యక్తికి 15 రోజులు జైలు శిక్ష విధించినట్లు సీఐ రామాంజులు తెలిపారు. రెండు రోజుల క్రితం రాఘవేంద్ర సర్కిల్‌లో పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. రాయచూరు నుంచి మంత్రాలయం మీదుగా బెంగళూరుకు వెళ్తున్న బస్సు ను ఆపారు. బస్సు డ్రైవర్ శివశంకర్ మద్యం తాగినట్లు గుర్తించారు. ఆయనను శుక్రవారం ఎమ్మిగనూరు జెఎఫ్‌సియం కోర్టులో హాజరుపర్చగా జైలు శిక్ష విధించినట్లు సీఐ తెలిపారు.


