గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రోడ్డు వెడల్పు చేసేందుకు రూ.17కోట్ల ఆర్‌అండ్‌బీ నిధులు విడుదల చేయించింది. మొదటగా మెడికల్ కళాశాల సమీపంలో రహదారి పనులు ప్రారంభం కాగా అక్కడ నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించి వారికి ప్రత్యామ్నాయంగా నంద్యాల–కర్నూలు కుందూ హైవే పక్కన స్థలాలు చూపారు. వీరితో పాటు బొగ్గులైన్, మూలసాగరం, బొమ్మలసత్రం, గాంధీనగర్ తదితర వాసులు దాదాపు 424 మందికి ఇళ్ల పట్టాలతో పాటు లే అవుట్ స్థలాలు చూపి ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు మౌలిక వసతులు కల్పించారు. సర్వేనం.502, 504లో 424 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా 162 మందికి టిడ్కో ఇళ్లు కేటాయింపు చేపట్టారు. దాదాపు రూ.5లక్షల విలువ చేసే సెంటు స్థలం ఇవ్వడంతో కొంత మంది ఇంటి నిర్మాణాలు చేపట్టుకోగా మరికొంత మందికి హద్దు రాళ్లు పాతి స్థలాలు చూపారు. ఈలోపు రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు వచ్చి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 18 నెలల తర్వాత స్థానికులకు ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా గుడిసెలు కూల్చివేస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.


