● మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి
బొమ్మలసత్రం: చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి పనికీ టీడీపీ నేతలకు టాక్స్ చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆళ్లగడ్డ పట్టణంలోని పీవీఎస్‌ఆర్ గోడౌన్‌లో కాంట్రాక్టర్ శివరామిరెడ్డి పై గుర్తుతెలియని ముగ్గురు దుండగులు కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన నేపథ్యంలో ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నంద్యాల ఉదయానంద ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథరెడ్డిలు ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. గుర్తుతెలియని ముగ్గురు దుండగులు శివరామిరెడ్డిపై కత్తితో హత్యాయత్నానికి పాల్పడడం దారుణం అన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రతి వ్యాపారి టీడీపీ నేతలకు ట్యాక్స్లు చెల్లించకుంటే బెదిరించడం ఆనవాయితీగా మారిందన్నారు. కోళ్ల వ్యాపారులు, ఇసుక, మట్టి రవాణా దారుల నుంచి అక్రమంగా టాక్స్లు వసూలు చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలకు ట్యాక్స్ చెల్లించకుంటే వారిపై బెదిరింపులు దాడులు చేయడం సర్వసాధారణమైందన్నారు. గోవింద పల్లె గ్రామంలో సోలార్ నిర్వాహకులను టీడీపీ నాయకులు కమీషన్ల కోసం బెదిరించారన్నారు. వారి ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులపై కేసు నమోదు చేశారన్నారు. ఇటువంటి నాయకులపై చర్యలు తీసుకొని పోలీసులు బాధితులకు అండగా నిలవాలని కోరారు.


