ఎలాంటి ధృవీకరణ లేకుండానే ప్యాకింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ఎలాంటి ధృవీకరణ లేకుండానే ప్యాకింగ్‌

Feb 22 2026 8:30 AM | Updated on Feb 22 2026 8:30 AM

ఎలాంటి ధృవీకరణ  లేకుండానే ప్యాకింగ్‌

ఎలాంటి ధృవీకరణ లేకుండానే ప్యాకింగ్‌

ఇష్టారాజ్యంగా విత్తనోత్పత్తి

వివిధ కంపెనీలు ఎలాంటి ధృవీకరణ లేకుండానే విత్తనాలు ప్యాకింగ్‌ చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం విత్తనోత్పత్తి జరిగితే మండల వ్యవసాయ అధికారులు పంటలను తనిఖీ చేసి విత్తనం నాణ్యతను సర్టిఫై చేస్తారు. సీడ్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ అధికారులు కూడా విత్తనోత్పత్తి చేసిన పంటలను వివిధ దశల్లో పరిశీలిస్తారు. ఈ వివరాలను వ్యవసాయ శాఖ కమిషనర్‌కు సమర్పించి ప్యాకింగ్‌కు అనుమతి తీసుకుంటారు. అయితే గత రెండేళ్లుగా విత్తనోత్పత్తి నిబంధనలకు విరుద్ధంగా సాగుతోంది. విత్తనోత్పత్తి వివరాలు వ్యవసాయ అధికారులకు ఇవ్వకపోయినా.. సీడ్‌ సర్టిఫికేషన్‌ అథారిటీకి అందించాలి. ఇక్కడ కూడా ముడుపులు పుచ్చుకొని గుడ్డిగా సర్టిఫై చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కర్నూలు(అగ్రికల్చర్‌): గిట్టుబాటు ధరలు లభించక, కనీసం మద్దతు ధర కూడా ఊరటనివ్వకపోవడంతో రైతులు విత్తనోత్పత్తి వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే కంపెనీలు కనీస మార్గదర్శకాలు, నిబంధనలు పాటించకపోవడం రైతులకు శాపంగా మారుతోంది. విత్తనోత్పత్తిలో పెట్టుబడి వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఉత్పత్తి చేసిన విత్తనాలను సంబంధిత కంపెనీలే రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తాయి. అంతా సవ్యంగా జరిగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. విత్తనోత్పత్తిలో నేరుగా విత్తన కంపెనీలు రైతులు ముందుకు రావడం లేదు. సీడ్‌ కంపెనీల తరపున ఆర్గనైజర్లు(దళారీలు) రైతులకు, విత్తన కంపెనీలకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. వీరి ద్వారానే రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు, సూక్ష్మపోషకాలు తదితరాలను సరఫరా చేస్తారు. విత్తనోత్పత్తి ఏఏ మండలాల్లో జరుగుతోంది. ఏఏ కంపెనీలు ఏ పంటల్లో సీడ్‌ ప్రొడక్షన్‌ చేస్తున్నాయనే కనీస సమాచారం వ్యవసాయ శాఖ వద్దలేదు. నిబంధనల ప్రకారం విత్తన కంపెనీలు వివరాలను విధిగా జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయాల్లో అందించాలి. రైతులతో అగ్రిమెంట్‌ చేసుకొని, కాపీ రైతులకు ఇవ్వాలి. సరఫరా చేసే విత్తనాలకు బిల్లులు తప్పనిసరి. అయితే విత్తన కంపెనీలు మార్గదర్శకాలను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. మండలాల వారీగా దళారీలను ఏర్పాటు చేసుకొని వారి ద్వారానే రైతులను గుర్తించడంతో పాటు రైతులకు విత్తనాలు, ఎరువులు, ఇతర ఇన్‌పుట్స్‌ ఇస్తున్నారు. ఫలితంగా పంట దెబ్బతిన్నప్పుడు దళారీలు చేతులెత్తేస్తున్నారు. కంపెనీలు మాకు సంబంధం లేదని పత్పుకుంటున్నాయి.

లోపాయికారీ ఒప్పందం

2025 ఖరీఫ్‌లో మొక్కజొన్న విత్తనోత్పత్తి చేపట్టిన రైతులు గతంలో ఎప్పుడూ లేని విధంగా నష్టపోయారు. విత్తనం కారణంగానే పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు తేల్చినప్పటికీ నష్టపోయిన రైతులను పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. ఉన్నతాధికారులు ఎలాంటి అగ్రిమెంట్లు లేకుండా విత్తనోత్పత్తి చేశారు, మీదే తప్పని చేతులెత్తేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కంపెనీలకు, వ్యవసాయ శాఖ యంత్రాంగానికి లోపాయికారీ ఒప్పందం ఉండటం వల్లే ఈ పరిస్థితి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

50వేల ఎకరాల్లో విత్తనోత్పత్తి

విత్తనోత్పత్తిలో ఉమ్మడి కర్నూలు జిల్లా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. వరి, పత్తి, వేరుశనగ, కంది, శనగ, మొక్కజొన్న, జొన్న, మినుము తదితర పంటలతో పాటు కూరగాయల పంటల్లోనూ దశాబ్దాల తరబడి విత్తనోత్పత్తి జరుగుతోంది. అయితే ఇటీవలి కాలంలో విత్తనోత్పత్తి దారితప్పింది. వ్యవసాయ శాఖ చూసీచూడనట్లు పోతుండటంతో విత్తన కంపెనీలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయి. 50వేల ఎకరాల్లో విత్తనోత్పత్తి జరుగుతున్నా ఏ ఒక్క వ్యవసాయ అధికారి పంటలను పరిశీలించని పరిస్థితి నెలకొంది. వ్యవసాయ అధికారులకు విత్తనోత్పత్తిపై కనీస సమాచారం కూడా లేకపోవడం గమనార్హం.

ఫిర్యాదుల వెల్లువ

2024–25లో మొక్కజొన్న విత్తనోత్పత్తికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో 150 వరకు ఫిర్యాదులు వచ్చాయి. 2025–26 సంవత్సరంలో నంద్యాల జిల్లా నందికొట్కూరు సబ్‌ డివిజన్‌లోనే మొక్కజొన్న విత్తనోత్పత్తికి సంబంధించి 52 ఫిర్యాదులు వచ్చాయి.

నంద్యాల జిల్లా మొత్తంగా 180 ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం.

కర్నూలు జిల్లా గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు, క్రిష్ణగిరి, మంత్రాలయం, కోడుమూరు, దేవనకొండ, కౌతాళం తదితర మండలాల నుంచి మొక్కజొన్న విత్తనోత్పత్తికి సంబంధించి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

మార్గదర్శకాలు పాటించని

విత్తన కంపెనీలు

వ్యవసాయ యంత్రాంగానికి

కనీస సమాచారం కరువు

సీడ్‌ ప్రొడక్షన్‌పై చూసీ చూడనట్లుగా

వ్యవహారం

దళారీల మాయలో నష్టపోతున్న రైతులు

ముంచెత్తుతున్న నాసిరకం,

నకిలీ విత్తనాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement