పాదయాత్ర మార్గంలో పోలీసుల తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

పాదయాత్ర మార్గంలో పోలీసుల తనిఖీలు

Feb 9 2026 8:00 AM | Updated on Feb 9 2026 8:00 AM

పాదయా

పాదయాత్ర మార్గంలో పోలీసుల తనిఖీలు

ఆత్మకూరు/రూరల్‌: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలయానికి భక్తులు వెళ్లే పాదయాత్ర మార్గాన్ని ఆదివారం బాంబ్‌ స్క్వాడ్‌ బృందం తనిఖీ చేసింది. భారీ సంఖ్యలో భక్తులు వెళ్తున్న ఈ మార్గంలో అసాంఘిక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉందనే అనుమానంతో ఈ తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ సునీల్‌ షెరాన్‌ రెండు రోజుల క్రితం ఈ మార్గా న్ని పరిశీలించి భక్తులకు పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు స్పెషల్‌ పార్టీ పోలీసులు ఈ మార్గంలో పహారా కాస్తున్నారు. పాదయాత్ర భక్తులు అటవీ మార్గంలో తీసు కోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు.

నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ

నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో ఈనెల 9వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీ దారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov. in వెబ్‌సైట్‌లో సంప్ర దించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్‌ కార్యాలయాల్లో, డివిజన్‌ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.

నేటి నుంచి ‘ఫార్మాటివ్‌’ పరీక్షలు

కర్నూలు సిటీ: పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నేటి(సోమవారం)నుంచి నిర్మాణాత్మక మూల్యాంకన పరీక్షలు(ఫార్మాటివ్‌ అసెస్‌మెంట్‌)–4 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు 12వ తేదీ వరకు ఈ పరీక్షలు ఉంటాయి. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఒకటి నుంచి 5వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. వేర్వేరు సమయాల్లో 6, 7, 8, 9 తరగతులకు పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి 19వ తేదీ వరకు ఫ్రీపైనల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన విద్యార్థులు 2.70 లక్షల మంది హాజరుకానున్నారు.

వణికిస్తున్న చలి

కర్నూలు(అగ్రికల్చర్‌): రాత్రి సమయంలో ప్రజలను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ప్రతి ఏటా ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 21 నుంచి 23 డిగ్రీల వరకు నమోదయ్యేవి. ప్రస్తుతం 19.2 డిగ్రీల వరకే పరిమితం అయ్యాయి. తెల్లవారుజామున చలి ఎక్కువగా ఉంటోంది. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో చలి ప్రభావం కనిపిస్తోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఉదయం 10 గంటల నుంచి ఎండల తీవ్రత పెరుగుతోంది. రానున్న రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.

పనుల్లేక వలసబాట

కోసిగి: పనుల్లేక ఆర్లబండ గ్రామం నుంచి ఆదివారం 50 కుటుంబాలు వలసబాట పట్టాయి. ఇళ్లకు తాళాలు వేసి లారీలో పిల్లపాపలతో కలిసి గుంటూరుకు వెళ్తున్నట్లు వారు తెలిపారు. గ్రామంలో ఎలాంటి పనులు లేక పోవడంతో వలస వెళ్తున్నామని చెప్పారు. పిల్లలను బడి మానిపించి తమ వెంట తీసుకెళ్తున్నట్లు తెలిపారు. గుంటూరులో నెలన్నర రోజుల పాటు పనులు చేసుకుని తిరిగి స్వగ్రామానికి వస్తామన్నారు.

పాదయాత్ర మార్గంలో పోలీసుల తనిఖీలు 1
1/1

పాదయాత్ర మార్గంలో పోలీసుల తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement