ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ: పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని క్లాక్‌టవర్ సమీప మైదానంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టు మిషన్లు, పవర్‌టూల్స్, జనరేటర్ల పంపిణీతోపాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 1,152 కుట్టు మిషన్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మిషన్లను ఇళ్లకు తీసుకెళ్లేందుకు అయ్యే రవాణా ఖర్చుల నిమిత్తం ఒక్కో మిషన్‌కు తన సొంతంగా రూ.500 అందిస్తున్నట్లు వెల్లడించారు. తురక కాశ వర్గానికి చెందిన పేదలకు రూ.1.50 కోట్లతో 94 జనరేటర్లు, పవర్‌టూల్ కిట్లను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. నల్లగొండ పట్టణంలో మొదటి విడతగా 700 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, త్వరలో మరో 500 ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో నల్లగొండ నియోజకవర్గంతోపాటు మరో ఐదు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 30 వేల మంది విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం అందించనున్నామని, ఇందుకోసం రూ.6 కోట్లతో నల్లగొండ మార్కెట్‌యార్డు సమీపంలో త్వరలో ప్రత్యేక వంటశాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
రూ.600 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు
నల్లగొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. రూ.600 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. దర్గాకు ఘాట్ రోడ్డు ఏర్పాటు చేశామని, మైదానంలో కార్పొరేషన్‌కు ఆదాయం వచ్చేలా భారీ కాంప్లెక్స్ నిర్మిస్తామని వెల్లడించారు. మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో రూ.20 కోట్లతో నిర్మించిన న్యాక్ కేంద్రంలో బోటిక్, ఎంబ్రాయిడరీ, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ తదితర వత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందాలని సూచించారు. అనంతరం లబ్ధిదారులకు మంత్రి కుట్టు మిషన్లు, పవర్‌టూల్ కిట్లు, జనరేటర్లు, 96 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా మైనారిటీ అభివృద్ధి అధికారి విజయేందర్ రెడ్డి, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
కనగల్ మండలం దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద రూ.15 కోట్ల పర్యాటక శాఖ నిధులతో చేపట్టిన విశ్రాంతి గృహం, హరిత హోటల్, ఆలయ సుందరీకరణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నల్లగొండ బైపాస్ నుంచి నల్లగొండ–సాగర్ రోడ్డు మీదుగా మంచినీళ్లబావి, దర్వేశిపురం, చర్లగౌరారం వరకు రూ.37 కోట్ల తో చేపట్టనున్న రహదారి పనులకు, మహబూ బ్‌నగర్–నల్లగొండ రహదారిపై మైలసముద్రం వరకు రూ.21 కోట్లతో చేపట్టనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు.


